Jagan Cheated Sitting MLAs in YSRCP: విశ్వసనీయత అంటే మాదీ నాదీ అని ఢంకా బజాయించి మరీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకుంటుంటారు. ఆయన భాషలో దానికి అర్థం అవసరానికి మనుషులను వాడుకోవడం తర్వాత వదిలించుకోవడమేనా. 2009లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు చూస్తే అన్ని సందర్భాల్లోనూ తనకు అధికారాన్ని తెచ్చిపెట్టేందుకు వాడుకుని తర్వాత వదిలేయటం ఆయన నైజమని స్పష్టమవుతోంది. అలా వదిలేసిన నాయకుల్లో కొందరు రాజకీయంగా కనుమరుగైపోయారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను బలిపశువులను చేసేందుకూ వెనుకాడడం లేదు. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు పేరుతో పదుల సంఖ్యలో సిట్టింగ్‌లను బలిపీఠం ఎక్కిస్తున్నారు.
ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు అంటగట్టి, వారిని పక్కనపెట్టడం వల్ల కలిగే ప్రయోజనమేంటి? అన్న దానిపై ప్రస్తుతం వైఎస్సార్సీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇదే జగన్ నైజం అంటూ ఆ పార్టీ నేతలు నిట్టూర్చుతున్నారు. 2009లో వైఎస్‌ఆర్ మృతి చెందినపుడు జగన్‌ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారు. అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకోలేదు. అప్పుడు జగన్ ఎలా ఫీలయ్యారో ఇప్పుడు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనంటే వారూ అలాగే ఫీల్ అవుతారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వ్యవహరించిన అలాంటి సందర్భాలను ఇప్పుడు వల్లె వేస్తున్నారు.
పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు
Leaders Deceived by Jagan:
Dr. Desai Tippareddy: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె నుంచి 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఎన్నికయ్యారు. కానీ ఆ జిల్లాలో తమకు రాజకీయ అవసరాల దృష్ట్యా మదనపల్లెలో ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పెద్దిరెడ్డి చెప్పడంతో 2019 ఎన్నికల్లో తిప్పారెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపారు. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటే మదనపల్లెలోనే కాదు రాయచోటిలో కూడా ఆ పనిచేసి ఉండొచ్చు. రాయచోటిలో తనకు అవసరమైన వ్యక్తి ఉండటంతో అక్కడ కాదని మదనపల్లెలో తిప్పారెడ్డిని తప్పించారు. తిప్పారెడ్డి వైఎస్సార్సీపీ ఏర్పాటుకు ముందు నుంచే జగన్‌కు మద్దతుగా నిలిచారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది బయటకు వెళ్లిపోయినా ఆయన మాత్రం జగన్ వెంటే ఉన్నారు. అయినా 2019లో టికెట్ లేదని జగన్ చెప్పేశారు. దీంతో తిప్పారెడ్డి జగన్ వద్దకు వెళ్లి ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. ఆ పరిణామంతో తిప్పారెడ్డి రాజకీయంగా కోలుకోలేదు.
Dr. Sunil Kumar: 2014లో వైఎస్సార్సీపీ తరఫున పూతలపట్టులో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్‌కుమార్‌కు 2019లో జగన్ టికెట్ ఎగ్గొట్టారు. టీడీపీ నేతలకు సునీల్ అమ్ముడుపోయారంటూ వైఎస్సార్సీపీ నేతలు చెప్పారనే కారణంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కానీ, నాపై ఇలా నింద వేయడాన్ని తట్టుకోలేకోతున్నా నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా అంటూ 2019 మార్చిలో సునీల్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనమైంది. అప్పట్లో ఆయన జగన్‌ను కలిసేందుకు లోటస్ పాండ్ చుట్టూ తిరిగినా, ఇంటి గేట్ వద్ద పడిగాపులు కాచినా అపాయింట్‌మెంట్ దక్కలేదు. ఓసారి జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్లినా, భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సునీల్‌ను పక్కకు పంపేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఎవరి టికెట్ చిరుగుతుందో! - జగన్ క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల నిరీక్షణ
Mekapati Rajamohan Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. జగన్ తర్వాత వైఎస్సార్సీపీ తరపున నెగ్గిన రెండో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. 2014లో ఎంపీగా గెలిచి దిల్లీలో వైఎస్సార్సీపీకి నాయకత్వం వహించారు. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్‌తో మరోసారి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కానీ 2019లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపుతారన్నారు కానీ అదీ జరగలేదు. టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారమూ సాగినా, ఆ అవకాశమూ ఇవ్వలేదు. మొత్తానికి రాజకీయంగా ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు.
MLA Alla Ramakrishna Reddy: జగన్ కళ్లలో ఆనందం కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కని కోర్టు మెట్లు లేవంటే అతిశయోక్తి కాదేమో. జగన్ ప్రత్యర్థులపై కేసులు వేసి వారు న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేశారు. రామకృష్ణారెడ్డిని గెలిపించండి ఆయన్ను మంత్రిని చేస్తానంటూ మంగళగరిలో జనం సాక్షిగా జగన్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో నారా లోకేశ్ లాంటి వ్యక్తిపైనా ఆర్కే గెలిచారు. కానీ 2019, 2022 మంత్రివర్గాల మార్పు సమయాల్లోనూ పదవి దక్కలేదు. ఇప్పుడు ఏకంగా సీటు కూడా లేకుండా చేశారు. ఆయనే పార్టీలోకి తీసుకువచ్చిన గంజి చిరంజీవిని ఇప్పుడు మంగళగిరి అభ్యర్థిని చేయడం ద్వారా ఆర్కే వేలితో ఆయన కళ్లనే పొడిచారు.
Mopidevi Venkataramana: ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్న సమయంలో మోపిదేవి వెంకటరమణ జగన్ అక్రమాస్తుల ఆర్జనకు సాయపడ్డారనే కేసులో జైలుకు కూడా వెళ్లారు. తర్వాత నుంచి ఆయన జగన్ వెంటే ఉన్నారు. 2014, 2019లోనూ ఓడిపోయినప్పటికీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అక్కడ నుంచే కథ మారింది. ఏడాదిలోపే మోపిదేవిని ఆ పదవి నుంచి తప్పించారు. పార్టీకి రాజకీయ ప్రయోజనం కోసం బీసీ కోటాలో రాజ్యసభకు పంపారు. వెళ్లనని ఆయన ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా పంపారు. కనీసం తన సొంత నియోజకవర్గం రేపల్లెలో పార్టీ బాధ్యత ఇవ్వమని పట్టుబడితే చివరకు ఆ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళగిరిలో ఆర్కేకి చేసినట్లే ఇక్కడా మోపిదేవికీ జగన్ షాకిచ్చారు. రేపల్లెలో రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ గణేష్‌ను గతంలో మోపిదేవి వైఎస్సార్సీపీలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అదే గణేష్‌ను రేపల్లె పార్టీ సమన్వయకర్తగా నియమించి, మోపిదేవిని పక్కనపెట్టారు.
వైఎస్సార్సీపీలో చిచ్చు రేపిన ఇంఛార్జ్‌ల నియామకం - కొనసాగుతున్న రాజీనామాల పరంపర
Nallapureddy Prasannakumar Reddy: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా రెండుసార్లూ హ్యాండిచ్చారు. మార్కాపురంలో 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జంకె వెంకటరెడ్డికి 2019లో టికెట్ ఎగ్గొట్టారు. అప్పటి నుంచి సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎన్నోసార్లు తిరిగారు. చివరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనతో ఆయన్ను ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు కూడా టికెట్ ఆశల్లో ఆయన్ను ఊరిస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదు.
2019 ఎన్నికల ముందు అడిగిన వారికందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామంటూ హామీలిచ్చిన జగన్ 2019 తర్వాత అధికారంలోకి రాగానే అసలు శాసన మండలినే రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తర్వాత రాజకీయ అవసరాల కోసం ఆ తీర్మానంపై అనుశీలన చేయకుండా నాలుగున్నరేళ్లూ వెళ్లదీశారు. ఈ కాలంలో 2019 ఎన్నికల ముందు హామీలిచ్చిన వారిలో అతికొద్ది మందికే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు.