గుంటూరు జిల్లా కొప్పర్రులో రాష్ట్ర హోంమంత్రి సుచరిత పర్యటించనున్నారు. వైకాపా శ్రేణులను పరామర్శించనున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతకు మందే తెదేపా వర్గీయులను పెదనందిపాడు పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని మాట్లాాడారు.
ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా సభ్యులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఊరేగింపు తెదేపా నేతల ఇళ్ల సమీపంలోకి రాగానే గొడవ మొదలైంది. ఇళ్లముందు కూర్చుని ఉన్న తెదేపా వర్గీయులపై రాళ్ల దాడి జరిగింది. వారు కూడా ధీటుగా స్పందించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ సమయంలో పెదనందిపాడు ఎస్సై నాగేంద్రతోపాటు ఐదారుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో గొడవను నియంత్రించడం సాధ్యం కాలేదు.
తెదేపా వర్గీయులతోపాటు ఎస్సైకూడా ప్రాణరక్షణకోసం తెదేపా మాజీ జడ్పీటీసీ శారద ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత 100మంది వరకు వైకాపా వర్గీయులు మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడికి దిగారు. రాళ్లతో కిటికీలు, తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కిటికీలు పగిలి పోవడంతో రాళ్లు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవారికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ ఇంటిముందున్న ఆరు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు. డీజిల్, కిరోసిన్ పోసి ఇంట్లో ఉన్నవారిని కూడా బయటకు రాకుండాచేయాలని ప్రయత్నించారు. లోపల ఉన్నవారంతా గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కరెంట్ మీటర్ వద్ద ఫీజులు తీసివేయడంతో చీకట్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కొప్పర్రులో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: PRATHIPATI PULLA RAO: కొప్పర్రు ఘటనకు పోలీసులే కారణం: ప్రత్తిపాటి పుల్లారావు