Baptism Ghat Construction Issue: మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ఘాట్ నిర్మాణం వివాదానికి దారి తీయగా.. ఈ ఆంశం హైకోర్టుకు చేరింది. డొంక భూమిలో నిర్మాణం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం వెంటనే పనులు నిలిపివేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అసలేంటి బాప్టిజం ఘాట్ నిర్మాణ వివాదం: గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఫార్సులతో.. కొన్ని నెలల క్రితం మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ స్థలాన్ని బాప్టిజం ఘాట్ నిర్మాణానికి కేటాయించింది. తెనాలి రోడ్డులోని తాగునీటి పథకం సమీపంలో ఈ స్థలం ఉండగా.. దాని వైశాల్యం ఐదు సెంట్లు. ఇటీవలే బాప్టిజం ఘాట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నెల వేతనాన్ని కూడా విరాళంగా అందించారు. బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు సాగుతున్న వేళ.. హిందూ సంఘాలు, స్థానిక బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు.
హిందూ సంఘాల, బీజేపీ నేతల అభ్యంతరం.. మతమార్పిడిలను ప్రోత్సహించేందుకు ఈ ప్రదేశంలో ‘‘బాప్టిజం ఘాట్’’ నిర్మాణం చేపట్టారని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే ఇదంతా సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులపై తమ నిరసన తెలుపుతూ ఘాట్ నిర్మాణం వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వీరి నిరసనలు, ఆరోపణలపై మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ స్పందించింది.
మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ స్పందన.. బాప్టిజం ఘాట్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. ఘాట్ నిర్మాణాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎవరితో సంబంధం లేకుండా, ఎలాంటి మత మార్పిడిలు లేకుండానే ఘాట్ నిర్మించుకుంటున్నామని తెలిపింది. హిందూ ధార్మిక సంస్థలకు అనుమతులు ఇస్తుంటే తాము అభ్యంతరం తెలపలేదని.. రాజ్యంగం ప్రకారం ఈ దేశంలో హక్కులున్నాయని పేర్కొంది.