High Court Judgment on Crop Loss due to Short Circuit: విద్యుదాఘాతంతో పంట నష్టం జరిగిన ఘటనలో.. విద్యుత్ శాఖ అధికారుల వాదనను హైకోర్టు సమర్థించింది. విద్యుదాఘాతంతో పంట నష్టం వాటిల్లిన వ్యవహారాన్ని ‘సేవాలోపం'గా పరిగణించి వినియోగదారుల కమిషన్ విచారించడానికి వీల్లేదన్న విద్యుత్ శాఖ అధికారుల వాదనను హైకోర్టు ప్రాథమికంగా సమర్థించింది. వినియోగదారుల చట్టంలోని 'సర్వీసు' అనే నిర్వచనం పరిధిలోకి పంట నష్టం వ్యవహారం రాదని 'యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్' కేసులో సుప్రీంకోర్టు 2013లో తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది.
పంట నష్టానికి రూ.1.20లక్షలు పరిహారంగా చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశిస్తూ ఏలూరు జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల అమలుకు బాధితుడు దాఖలు చేసిన ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ (ఈఏ) తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జామాయిల్ పంట దగ్ధమైన ఘటనలో పరిహారం ఇప్పించాలని కోరుతూ పర్వతనేని శ్రీరంగ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏలూరు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విద్యుత్ శాఖ అధికారుల సేవాలోపం కారణంగా ప్రమాదం చోటు చేసుకుందన్నారు. విచారణ జరిపిన కమిషన్.. 1.20 లక్షల పరిహారంతో పాటు 5 వేల రూపాయలను ఖర్చులుగా పిటిషనర్‌కు చెల్లించాలని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించింది. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో శ్రీరంగ శ్రీనివాసరావు.. తీర్పు అమలు కోసం వినియోగదారుల కమిషన్లో ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ (ఈఏ) దాఖలు చేశారు.
మరోవైపు పరిహారం చెల్లించాలంటూ 2022 జూన్ 3న వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పెదవేగి మండలం జానంపేట ఏపీఈపీడీసీఎల్ సబ్ స్టేషన్ సహాయ ఇంజనీర్, ఏలూరు ఈపీడీసీఎల్ ఎస్ఈ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరపు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్రావు వాదనలు వినిపించారు. పంట నష్టం వ్యవహారం సేవాలోపం కిందకు రాదన్నారు.
ఈ వ్యవహారంపై వినియోగదారుల కమిషన్‌కు విచారించే పరిధి లేదన్నారు. విద్యుత్ ట్రైబ్యునల్ లేదా ఏపీఈఆర్సీ, లేదా సివిల్ కోర్టులను ఆశ్రయించాలని తెలిపారు. సేవాలోపం కిందకు రాదనే వాదనకు బలం చేకూర్చేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈఏలో ప్రక్రియపై స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఇవీ చదవండి: