పెనుమూడి పల్లెపాలెంలో వరదకు పాడైన గృహాన్ని చూపుతున్న దంపతులు
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి దిగువ కృష్ణానదికి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసిన ప్రతిసారీ లంక గ్రామాల్లోని గృహాలు పెద్దసంఖ్యలో ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి వరద నీటిలో చిక్కుకున్న నివాసాలు పూర్తిస్థాయిలో దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాలకు చెందిన గ్రామాలు అధికంగా వరద ముంపు బారిన పడుతున్నాయి. 2019లో కృష్ణమ్మ పరవళ్లకు జిల్లాలోని 19 గ్రామాల్లోకి వరద నీరు రాగా అందులో కొల్లూరు మండలలో 8, భట్టిప్రోలు మండలంలో 4, రేపల్లె మండలంలో ఒకటి చొప్పున ముంపునకు గురై 4 వేల గృహాలు నీట మునిగాయి. ప్రస్తుతం కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో సుమారు 1500 ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. నీట మునిగిన వాటిలో ఇటుక, మట్టి గోడలతో పేదలు నిర్మించుకున్న పూరిళ్లే అధికంగా ఉన్నాయి.
సాయం కంటితుడుపే..
గతేడాదిలో వచ్చిన వరదకు నష్టానికి గురైన గృహాలకు నేటి వరకు ప్రభుత్వ పరిహారం అందలేదని బాధితులు విమర్శిస్తున్నారు. వరద ముంపునకు గురైనపుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు మిన్నకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు, ఉన్నతాధికారులు వచ్చి హడావుడి చేసి వరద తగ్గిన తర్వాత ఇటువైపు తొంగి చూడటం లేదు. దీంతో వరద నీటిలో నాని పాడైన నివాసాలను బాగుచేసుకునేందుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల మేరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మళ్లీ సంవత్సరం కష్టపడితే కానీ దెబ్బతిన్న ఇళ్లు బాగుపడే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి వరద ముంపునకు గురై పాడైన నివాసాలకు ప్రభుత్వ పరిహారం అందేలా చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దారు విజయశ్రీ మాట్లాడుతూ ముంపునకు గురైన ఇళ్ల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి