పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల గెలిచిన సర్పంచి అభ్యర్థుల ఆధిక్యం కన్నా నోటా, చెల్లని ఓట్లు అధికంగా రావటం విశేషం. నోటా, చెల్లని ఓట్లు అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపాయి. వెదుళ్లపల్లి సర్పంచిగా కుంచాల గోవిందమ్మ 30 ఓట్లతో గెలిచారు. ఈ పంచాయతీలో నోటాకు 49, చెల్లని ఓట్లు 153 ఓట్లు వచ్చాయి. ఓట్లు చెల్లి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఓడిపోయిన అభ్యర్థి కొమ్మనబోయిన ఇందిర వాపోయారు.
నరసాయపాలెంలో చెల్లని ఓట్లు 101 ఉన్నట్లు, నోటాకు 46 పోలైనట్లు లెక్కింపులో తేలింది. చెరువు జమ్ములపాలెం సర్పంచిగా బోయిన వెంకటేశ్వరమ్మ 41 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు సరళి పరిశీలిస్తే ఈ పంచాయతీలో 71 ఓట్లు చెల్లలేదు. నోటాకు 17 ఓట్లు పడ్డాయి. డమ్మీ అభ్యర్థికి 28 ఓట్లు రావడంతో సర్పంచి ఎన్నిక ఫలితంపై చివరి వరకు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
పిట్టలవానిపాలెం మండలంలో భవనంవారిపాలెం సర్పంచిగా మోదుగుల శివ నాగేశ్వరి 86 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ 58 ఓట్లు చెల్లలేదు. నోటాకు 18 ఓట్లు వచ్చాయి. మేజర్ పంచాయతీ చందోలులో నోటాకు 75 ఓట్లు, చెల్లని ఓట్లు 115 ఓట్లు నమోదయ్యాయి. బాపట్ల మండలం మురుకుండపాడు పంచాయతీలో ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నారు. ఇక్కడ ఓటర్లు వేసిన ఓట్లు అన్ని చెల్లాయి.
ఇవీ చూడండి:
సెల్ఫీ వీడియో: 'నేను ప్రచారం చేస్తే అరెస్టు చేస్తానన్నారు.. అజ్ఞాతంలోకి వచ్చేశా'