వకీల్ సాబ్ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న టికెట్ల రేటు ప్రకారమే థియేటర్లలో ప్రదర్శించాలని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. అధిక రేట్లతో టికెట్లు అమ్మితే సంబంధిత థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలోని 48 థియేటర్ల యాజమాన్యాలు ఏప్రిల్ 9 వ తేదిన విడుదల కాబోతున్న “వకీల్ సాబ్” చిత్రానికి టికెట్ రెట్ల పెంపుపై.. ఆమెకు దరఖాస్తులు పెట్టారు. వాటిని పరిశీలించారు.
థియేటర్ల యాజమాన్యాలు ప్రతిపాదించిన టికెట్ రెట్లు సామాన్యునికి చేరువలో లేవని.. ధరల పెంపుదల పేద , మధ్య తరగతి కుటుంబాలను ప్రభావితం చేస్తుందన్నారు. ప్రజా ప్రయోజనాలను కోవిడ్ మహమ్మారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వారు ప్రతిపాదించిన టికెట్ ధరలను అనుమతించడంలేదని జేసీ ప్రశాంతి స్పష్టం చేశారు. సినిమా థియేటర్లలో టికెట్లు అధిక మొత్తంలో అమ్మకం జరుగకుండా పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లకు పలు సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి. తన ప్రవర్తనతో.. అందరినీ ఔరా అనిపించిన రామచిలుక..!