కరోనా.. మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. మానవత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. కన్నవారు మరణించినా.. వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా వెనుకడుగు వేసేలా భయపెడుతోంది. అలా చాలామంది తమవారి మృతదేహాలను అనాథ శవాలుగా వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి చూసి చలించిన గుంటూరుకు చెందిన కొందరు యువకులు.. ఆ అనాథ మృతదేహాలకు ఆత్మబంధువుల్లా మారారు. గుంటూరు కొవిడ్ ఫైటర్స్ పేరిట ఓ సంస్థగా ఏర్పడి.. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత చేపట్టారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలో ఎక్కడైనా మృతదేహం ఉందని తెలిస్తే.. వారి వాహనంలోనే తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
260 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి..
గత ఏడాది కరోనా విలయం సృష్టించినప్పటి నుంచీ ఇప్పటి వరకు దాదాపు 260 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు గుంటూరు కొవిడ్ ఫైటర్స్. ప్రజల్లో కరోనా పట్ల ఉన్న అపోహలే.. అయినవారిని అనాథ శవాలుగా వదిలేసే పరిస్థితికి కారణమని కొవిడ్ ఫైటర్స్ ప్రతినిధులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. దహన సంస్కారాలు నిర్వహించ వచ్చని చెబుతున్నారు.
మృతదేహాలు తీసుకెళ్లే సమయంలో.. సంబంధిత కుటుంబసభ్యుల్లో కొందరి ప్రవర్తన విపరీతంగా ఉంటోందని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను తరలించే సమయంలో కనీసం సాయపడటానికి కూడా వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు స్మశానవాటిక దగ్గరికి కూడా రావట్లేదని.. దూరం నుంచే వదిలేసి వెళ్లిపోతున్నారని అంటున్నారు. కొవిడ్ పట్ల అపోహల్ని దూరం చేసి కనీసం తమ వారి చివరిచూపుకైనా వచ్చేలా అవగాహన కల్పించాలని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ కోరుతున్నారు.
ఇదీ చదవండి: