Municipal Schools: రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల విలీనానికి రంగం సిద్ధం ! - ఏపీలో మున్సిపల్ పాఠశాలల విలీనానికి రంగం సిద్ధం
Municipal Schools Merge into Education Department: విద్యాశాఖలో పురపాలక పాఠశాలల విలీనానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలలతో పాటు ఆస్తుల బదిలీకి సంబంధించి పురపాలక కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే.. ఎప్పుడో దాతలిచ్చిన పురపాలక పాఠశాలల ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Municipal Schools Merging in AP: రాష్ట్రవ్యాప్తంగా 59 పురపాలక, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో 2వేల 115 పురపాలక పాఠశాలు ఉన్నాయి. వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుతున్నారు. పురపాలక పాఠశాలు అంటేనే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు భరోసా అందించే విద్యాకేంద్రాలు. తాజాగా ఈ పాఠశాలను విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విలీన ప్రక్రియలో భాగంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు తీర్మానాలు చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ పాఠశాలలు కూడా విద్యాశాఖ పరిధిలోకి వస్తే వీటిని కూడా కుదించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో చదువు దూరమయ్యే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పురపాలక పాఠశాలలను ఒకప్పుడు దాతలిచ్చిన స్థలాల్లో నిర్మించారు. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ స్థలాల పరిరక్షణ సాధ్యమవుతుందా అన్న అనుమానాలున్నాయి. తల్లిదండ్రుల కమిటీల ఆమోదం లేకుండానే కౌన్సిల్లో తీర్మానాల ద్వారా విలీనం చేయడం ఏ మేరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో జడ్పీ పాఠశాలల విలీనం సమయంలో ఆస్తుల జోలికి పోకుండా కేవలం విద్యాపర్యవేక్షణ వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆస్తుల బదలాయింపు చేయడం వెనుక ఉద్దేశ్యమేంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
పురపాలక పాఠశాలలు విద్యాశాఖలో విలీనమైతే ఉపాధ్యాయుల సర్వీసు సైతం విద్యాశాఖలో విలీనమవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు వివాదం ఎన్నో ఏళ్లుగా వివాదంలో ఉంది. తాజాగా మున్సిపల్ పాఠశాలలను సైతం విలీనం చేయడం వల్ల గందరగోళం మరింత పెరిగే అవకాశముంది. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పురపాలక, నగరపాలక పాఠశాలలు, ఆస్తుల విలీనం నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: