High Court Angry on Visakha CP and Prakasam SP : సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల విషయంలో విశాఖపట్నం మద్దిలపాలెం నివాసి బోస రమణ అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రమణ అరెస్టు విషయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖ పోలీస్ కమిషనర్ అందజేసిన నివేదికలలో తేడాలుండటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను దాచేందుకు పోలీసులు మరిన్ని తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మరోవైపు రమణ అరెస్ట్ విషయంలో డీజీపీ నివేదిక దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
డీజీపీ పదవిపై ఉన్న గౌరవంతో తమ ముందు హాజరుకావాలని ఆదేశించకుండా నియంత్రించుకుంటున్నామని వ్యాఖ్యానించింది. కేసు సున్నితత్వం దృష్ట్యా నివేదిక కోరామని తెలిపింది. రాతపూర్వక ఉత్తర్వులిస్తేనే నివేదిక ఇస్తామంటే ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. సహాయ ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
కమిషనర్, ఎస్పీ వేర్వేరుగా నివేదికలు : తన భర్త రమణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ బోస లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం విశాఖ పోలీసు కమిషనర్, ప్రకాశం ఎస్పీలను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై డీజీపీ దృష్టిపెట్టాలని హైకోర్టు పేర్కొంది. విశాఖ పోలీసు కమిషనర్, ప్రకాశం ఎస్పీ వేర్వేరుగా నివేదికలు వేశారు.
రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఇంటివద్ద అరెస్ట్ చేశారని విశాఖ పోలీసు కమిషనర్ నివేదిక ఇచ్చారని, ఇంక రమణకు నోటీసులు ఇవ్వడానికి ఇంటికెళితే రమణ బంధువులు విధులకు ఆటంకం కలిగించి గొడవ చేశారని దీంతో విశాఖలోని ఎంవీపీ పోలీసు స్టేషన్‌కు తరలించి అక్కడ అరెస్ట్ చేసినట్లు ప్రకాశం ఎస్పీ నివేదిక ఇచ్చినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. భిన్న వివరాలు పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.