FARMER SUCIDE NO COMPANSATION: అనగనగా అంకమ్మరావు అనే కౌలు రైతు. ఆయన సాగు చేసిన వరి పంట వర్షాలకు నీట మునిగింది. గింజ చేతికి రాక పెట్టుబడంతా వృథా అయింది. చేసిన అప్పుల భారం ఓ వైపు, పంట పోయిందనే బాధ మరోవైపు అంకమ్మరావుని ఆత్మహత్యకు పురిగొల్పాయి. అంకమ్మరావు మరణంతో పుట్టెడు బాధలో ఉన్న అతడి భార్య.. పరిహారం కోసం తిరిగింది, తిరుగుతోంది. ఇంకా తిరుగుతూనే ఉంది. ఇలా రోజులు కాదు, నెలలు కాదు, పన్నెండేళ్లు దాటినా పరిహారం రాలేదు. గుంటూరు జిల్లాకు చెందిన కౌలు రైతు భార్య పుష్కర కాలం పైగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న వైనంపై ప్రత్యేక కథనం మీకోసం..
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన నన్నం అంకమ్మరావుకు.. సొంత పొలం లేదు. 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు. 2010లో పొలంలో వరిసాగు పెట్టుబడుల కోసం రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. పైరు కోతకు వచ్చింది. కొద్ది రోజుల్లో కోయాల్సి ఉండగా అధిక వర్షాలు కొంప ముంచాయి. పైరు నీట మునిగింది. అంకమ్మరావు గుండె చెరువైంది. పంట దక్కదని అర్థమైంది. దీంతో పొలంలోనే పురుగుల మందు తాగి తనవు చాలించాడు.
2010 డిసెంబర్ 28న ఈ ఘటన జరిగింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల జాబితాలో అంకమ్మరావు పేరు చేరింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. అంకమ్మరావు భార్య మరియమ్మ.. పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివరాలు తీసుకున్నారు. కానీ పరిహారం మాత్రం రాలేదు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ మరియమ్మ తిరుగుతూనే ఉంది. 2015లో స్పందనలో కలెక్టర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుంది. దీంతో ఆయన అధికారుల్ని మరోసారి అక్కడికి పంపించి వివరాలు తీసుకున్నారు. పరిహారం తప్పకుండా వస్తుందని మరియమ్మ ఆశించింది. అయితే ఆమె ఆశ అడియాసే అయ్యింది. పన్నెండేళ్లైనా పరిహారం రాలేదు గానీ.. కాగితాల ఖర్చులు, కాళ్ల నెప్పులు మాత్రం మిగిలాయి.
మరియమ్మ కూలీ పని చేసుకుని జీవించేది. అనారోగ్యంతో కొన్నేళ్లుగా కూలీ పనులకు వెళ్లటం లేదు. కుమారుడు, కోడలు పనులకు వెళ్తుంటారు. అంకమ్మరావు చేసిన అప్పులు తీర్చటానికి కుటుంబం అష్టకష్టాలు పడింది. భర్త ఆత్మహత్యకు పరిహారం కోసం ఆమె ఎదురు చూపులు మానలేదు. వీలున్నప్పుడల్లా వెళ్లి అధికారులకు అర్జీలు ఇస్తుంటుంది. ఒంటరిగా వెళ్లలేని పరిస్థితుల్లో కోడల్ని తీసుకుని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తన గోడు చెబుతుంది. ఆమె గోడును విన్నవారు లేరని.. పరిహారం గురించి స్పందించిన వారు లేరని మరియమ్మతో పాటు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
అంకమ్మరావు మరణించాడు. ఆయన భార్య మరణించే లోపైనా పరిహారం వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. బాధితులను ఆదుకుంటే అది పరిహారం అవుతుంది. కానీ పుష్కర కాలం నుంచి తిప్పుతున్నారంటే అది పరిహాసమే అవుతుంది. మరి దీనికి కారణం ఎవరు. బాధ్యులు ఎవరో తెలియదు కాని బాధితురాలు మాత్రం మరియమ్మే.
"నా భర్త చనిపోయినప్పటి నుంచి నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఎమ్ఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, తెనాలి ఆర్డీఓ ఆఫీసు ఇలా ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను."
- మరియమ్మ, మృతుడి భార్య