ETV Bharat / state

అచ్చం అలాగే ఉన్నాయి..ఆ పురుగుమందు డబ్బాలు..! - గుంటూరు జిల్లాలో నకిలీ పురుగులు మందులు తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో మరో నకిలీ పురుగు మందుల దందా వెలుగు చూసింది. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన పురుగులు మందు డబ్బాలను ..అలాంటి లేబుల్​తో రూపొందించి నకిలీవి పురుగులు మందులను విక్రయిస్తున్నారు. వీటిపై ఫిర్యాదు అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించారు.

guntur district fake pesticides
గుంటూరు జిల్లాలో నకిలీ పురుగులు
author img

By

Published : Oct 30, 2020, 5:34 PM IST

సెప్టెంబరు నెలలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ కంపెనీకి చెందిన పురుగుల మందుకు నకిలీలు తయారుచేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపగా సున్నా శాతం రసాయనం ఉన్నట్లు నివేదిక వచ్చింది. అంటే ఈ మందు పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో ఇదే మందు డబ్బాలు నకిలీవి బుధవారం పట్టుబడ్డాయి. దీంతోపాటు మరో కంపెనీకి చెందిన నకిలీ పురుగుమందు డబ్బాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ ఎక్కువగా జిల్లాలో పత్తి పంటకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో రూ.కోట్ల విలువైన క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. వరుసగా నకిలీ పురుగుమందులు పట్టుబడుతుండటంతో వ్యవసాయశాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా వేయడంతో అక్రమార్కుల గుట్టు వెలుగులోకి వస్తోంది.

ప్రముఖ కంపెనీలను పోలిన డబ్బాలు

జిల్లాలో ఎక్కువగా విక్రయం జరుగుతున్న పురుగుమందులను గుర్తించిన కొందరు అక్రమార్కులు వాటికే నకిలీలు తయారు చేసి మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీ డబ్బాను పోలిన విధంగానే ఎక్కడా చిన్న తేడా కూడా లేకుండా నకిలీలు తయారు చేస్తున్నారు. అసలు, నకిలీ.. పక్కపక్కనే పెట్టి చూసినా గుర్తించలేని విధంగా తయారుచేశారు. కంపెనీ తయారుచేసిన డబ్బాపై స్క్రాచ్‌ను తుడి చేస్తే నంబర్లు కనిపిస్తాయి. నకిలీ డబ్బాపై స్క్రాచ్‌ సైతం ముద్రించినా దానిని తుడిచివేయడానికి వీలుకావడం లేదు. ఇది మాత్రమే అసలు, నకిలీది గుర్తించడానికి అవకాశముంది. రెండు డబ్బాలు ఒకే రకంగా ఉండటంతో రైతులు గుర్తించే పరిస్థితి లేదు. రసాయనం పిచికారీ చేసినా పని చేయకపోవడం రైతులకు ఆర్థికంగా నష్టజరగడంతోపాటు పైరుకు నష్టం వాటిల్లుతోంది.

తీగ లాగితే కదిలిన డొంక

ప్రత్తిపాడు మండలంలో ట్రేసర్‌ నకిలీ పురుగుమందు పట్టుబడటంతో యంత్రాంగం అప్రమత్తమై నిఘా పెట్టింది. ఈక్రమంలో డెలిగేట్‌ పురుగుమందుకు నకిలీది మార్కెట్‌లోకి వచ్చినట్లు గుర్తించారు. అమరావతి మండలంలో ఇది విక్రయించిన డీలరును గుర్తించి సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తికి విజయవాడకు చెందినవారు సరఫరా చేసినట్లు తేలడంతో అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి సప్లయి చేసినట్లు తేలడంతో అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.

పకడ్బందీగా అక్రమ వ్యవహారం

జిల్లాలో ఎక్కువగా రైతులు కొనుగోలు చేస్తున్న ఆరు ఉత్పత్తులకు నకిలీ పురుగుమందులను తయారు చేసిన కీలక సూత్రధారి వాటి అమ్మకాలకు పకడ్బందీ ప్రణాళిక అమలుచేసినట్లు తెలుస్తోంది. గతంలో పురుగుమందుల దకాణాల్లో గుమస్తాలుగా పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నవారిని ఎంపిక చేసుకున్నారు. వీరి ద్వారా ఎంపిక చేసుకున్న పురుగుమందుల దుకాణాలకు సరఫరా చేసి విక్రయిస్తున్నారు. వీరు జిల్లా వ్యాప్తంగా డీలర్లలతో ఉన్న పరిచయాల ఆధారంగా సరకు సరఫరా చేసి క్షేత్రస్థాయికి చేరుస్తున్నారు. వీటికి డీలర్లు బిల్లులు కూడా ఇవ్వడం గమనార్హం. డీలర్లు కొన్ని కంపెనీ పురుగుమందులు విక్రయిస్తూ వాటి మాటున నకిలీలు అమ్మి లబ్ధి పొందుతున్నారు. ఈక్రమంలో బుధవారం ఒక రైతుకు డబ్బులు ఇచ్చి పురుషోత్తపట్నంలో కొనుగోలు చేయించగా నకిలీ డబ్బాలు అమ్మడంతోపాటు డీలరు బిల్లు కూడా ఇవ్వడంతో అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు.

వారికి నేతల అండ..

జిల్లాలో నకిలీ పురుగుమందులు విక్రయిస్తూ దొరికినప్పుడు సైతం వారిపై చర్యలు తీసుకోకుండా కొందరు ప్రజాప్రతినిధులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. దీంతో విచారణ పూర్తికాకుండానే అర్ధంతరంగా ఆగిపోతోంది. నకిలీ పురుగుమందులు పట్టుబడితే ఒక మంత్రి జోక్యం చేసుకోవడంతో పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే అది అటకెక్కింది. మరోసారి ఎమ్మెల్యే ఒకరు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో అధికారులు ముందుకు వెళ్లలేక తర్జనభర్జన పడుతున్నారు. రైతులకు అండగా ఉంటూ అక్రమార్కులకు సంకెళ్లు వేయించాల్సిన ప్రజాప్రతినిధుల్లో కొందరు వారికి వత్తాసు పలకడంతో దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాల్సి ఉంది.

ఇదీ చూడండి. వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.