మీ పిల్లలు ఇంజనీరంగ్ పూర్చి చేశారా..?? విదేశాల్లో ఉద్యోగం చేయటమే మీ ధ్యేయమా..?? అయితే మేమున్నాం. మీరు కోరుకున్న దేశంలో కొలువులో కుదిరేందుకు మాది పూచీ..అంటూ మాయ మాటలు చెప్పిందా సంస్థ. విద్యార్ధులతో పాటుగా వారి తల్లిదండ్రులకు ఎరవేసి అందినకాడికి దోచుకుని చివరికి బోర్డు తిప్పేసింది.
గుంటూరులో అబ్రాడ్ బీస్ పైలట్ బిజినెస్ కన్సల్టెంట్స్ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో బీటెక్ పూర్తయిన విద్యార్ధులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిలువునా ముంచింది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు కట్టించుకుని ఉడాయించింది. 22మందికి పైగా విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి 50లక్షలకు పైగా సొమ్మును స్వాహా చేసింది.
ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా అసలు సంగతి ఊసు లేక ఇక ఆశలు వదులుకున్నామని బాధితులు వాపోతున్నారు. ఆరా తీయడానికి ఆఫీసుకెళ్తే తాళాలు వేసిన దృశ్యం వారిని వెక్కిరించింది. చేసేది లేక గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యలయాన్ని ఆశ్రయించారు. తినీ,తినక,పస్తులు ఉండి, డబ్బులు వడ్డీకి తీసుకువచ్చి తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించిన తల్లిదండ్రులు కన్నీరు ఒక్కటే మిలిగిందని వాపోయారు.
గతంలో పలుమార్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఫలితం లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని బాధితులు వెల్లడించారు.