Guntur SP On Chandraiah Murder Case: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో తెదేపా నాయకుడు తోట చంద్రయ్యను వ్యక్తిగత కక్షతోనే ప్రత్యర్థులు హత్య చేసినట్లు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. ఈ హత్య కేసులో 24 గంటల్లో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను తెలిపారు. చంద్రయ్యకు అదే ప్రాంతానికి చెందిన చింతా శివరామయ్యకు మూడేళ్ల కిందట సిమెంట్ రోడ్డు వేసే విషయంలో గొడవలు జరిగాయన్నారు. ఈనెల 10న ఆ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తోట చంద్రయ్య తన బంధువులతో చింతా శివరామయ్యను చంపుతానని చెప్పాడు. ఆ విషయం బంధువుల ద్వారా శివరామయ్యకు తెలియడంతో అతని కంటే ముందే చంద్రయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన కుమారుడు ఆదినారాయణకు చెప్పి మరో ఆరుగురి ద్వారా చంద్రయ్య హత్యకు పథకం వేశాడు. ఈనెల 13న ఉదయం ద్విచక్రవాహనంపై బజారుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న చంద్రయ్యను దారికాచి శివరామయ్య మరో ఏడుగురితో కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబు, ఎస్సైలు అనిల్‌కుమార్‌రెడ్డి, పాల్‌రవీంద్ర ఘటనాస్థలికి చేరుకున్నట్లు వెల్లడించారు. నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలతో బృందాలను నియమించామన్నారు. ఈ హత్య కేసులో చింతా శివరామయ్య ప్రధాన నిందితుడు కాగా, అతని కుమారుడు చింతా ఆదినారాయణ, బంధువులు చింత యలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణలను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి, డీఎస్పీ జయరామ్‌ప్రసాద్, సీఐ సురేంద్రబాబు పాల్గొన్నారు.
![](https://assets.eenadu.net/article_img/ap-crime1b_7.jpg)
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినీ వదిలేది లేదని అన్నారు.
ఇదీ చదవండి: TDP Leader Murder: గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుడు హత్య..గుండ్లపాడులో ఉద్రిక్తత