Delhi liquor scam case: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్‌బాబును అరెస్టు చేసింది. ఈ ఇద్దరికి రూ.కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎమ్‌డీలు చెల్లించినట్లు శరత్‌పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను గతంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్ చంద్రారెడ్డిని అధికారుల ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎమ్‌డీలను శరత్ చెల్లించారు. ఈ క్రమంలోనే ఆయనను విచారించిన ఈడీ.. దిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇద్దరినీ 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఈడీ తరఫు న్యాయవాది కోరగా.. వారం రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. దర్యాప్తు సమయంలో అవసరమైన వైద్య సహాయం ఇవ్వాలని.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విచారణ చేయాలని ఆదేశించింది. ఇద్దరు నిందితులను కలిసేందుకు కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వాలన్న ప్రత్యేక కోర్టు.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
శరత్ చంద్రారెడ్డే కీలక సూత్రధారి..: ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక సూత్రధారిగా కస్టడీ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. దిల్లీ లిక్కర్ మార్కెట్‌లో 30 శాతం తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలిపింది. బినామీ కంపెనీల ద్వారా శరత్ చంద్రారెడ్డి 9 రిటైల్ జోన్స్ పొందారన్న ఈడీ.. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారని పేర్కొంది. ఈ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లు చెల్లించారని కస్టడీ రిపోర్టులో వెల్లడించింది. విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారని తెలిపిన ఈడీ.. శరత్‌కు చెందిన 3 కంపెనీల ద్వారా రూ.64 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించింది. సుమారు రూ.60 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించారని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి..