Guntur Government Hospita: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలకు పెట్టింది పేరు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు రోజుకు వేల సంఖ్యలో ఆస్పత్రికి వస్తారు. రోగులతోపాటు సహాయకులు వెంట వస్తారు. లోపల గదుల్లో ఇన్ పేషెంట్లకు తప్ప మరెవరికీ మరుగుదొడ్ల సదుపాయం కల్పించలేదు. రోగుల వెంట వారి సంఖ్యలో తరలివస్తారు. మల,మూత్ర విసర్జనకు ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడా సదుపాయం లేదు. రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకున్న తర్వాత రోగుల సహాయకులు బయటే ఉండాలి. వార్డుల్లో కాకుండా బయటే వందలాదిమంది విశ్రాంతి తీసుకుంటారు.
వీరికి తాగునీటితోపాటు మరుగుదొడ్లు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడ ఖాళీస్థలం దొరికితే అక్కడ విసర్జించడం వల్ల ఆస్పత్రి అపరిశుభ్రంగా మారుతోంది. పగటిపూట జనసంచారం ఉండటంతో ప్రధానంగా మహిళలకు కాలకృత్యాలు తీర్చుకోవడం సమస్యగా మారింది. ఒక్కోసారి దూరప్రాంతాలకు ఆటోలపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రివేళ జనసంచారం లేని సమయంలో మహిళలు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. క్యాజువాల్టీ వైపు గతంలో ఉన్న మరుగుదొడ్లను కొవిడ్ సమయంలో ఆక్సిజన్ సరపరా విభాగం ఏర్పాటు కోసం కూల్చివేశారు.
ఫలితంగా రోగుల సహాయకుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. జీజీహెచ్లో తాగునీటికి ఇబ్బందులున్న సమయంలో మరుగుదొడ్ల నిర్వహణకు సమస్య ఏర్పడింది. పెద్దాస్పత్రిలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం స్పందించాలని.... తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సమస్య వాస్తవమేనని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని.... ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేసినట్లు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి చెప్పారు.
సమస్య మా దృష్టికి వచ్చింది.. ఈ సమస్య వాస్తవమే.. దాని కోసం మేము ఒక ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది. అందులో పబ్లిక్ టాయిలెట్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. కలెక్టర్ గారి అప్రువల్ తీసుకుని పనులు ప్రారంభిస్తాం.- డాక్టర్ ప్రభావతి, సూపరింటెండెంట్
ఇవీ చదవండి: