DSC Notification in AP: ప్రతిపక్షంలో ఉండగా మెగా డీఎస్సీ అని ఊదరగొట్టిన జగన్.. అధికారం చేపట్టాక లక్షల మందిని మోసం చేశారు. ఉన్న పోస్టులను రద్దు చేశారు. ఇటీవల శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 18,520 ఖాళీలున్నాయి. కానీ వీటిలో 8,366 పోస్టులే అవసరమని ప్రభుత్వం వెల్లడించింది. అంటే మిగతా 10,154 పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తుందా అన్నది.. ప్రశ్నగా మిగిలింది.
మేనిఫెస్టోలోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే.. ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి, ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలని ప్రతిపక్షనేతగా జగన్ చెప్పారు. కానీ.. మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్.. సీఎం అయ్యాక మాట తప్పి, మడమ తిప్పేశారు. కొన్ని ఖాళీలను రద్దు చేసి, మరికొన్నింటిని సర్దుబాటులో సర్దేశారు. మాట నిలబెట్టుకోకపోతే పదవికి రాజీనామా చేసి, ఇంటికి వెళ్లిపోవాలన్న జగన్‌కు.. ఇప్పుడా మాటలే గుర్తుకు రావడం లేదు.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రెండు డీఎస్సీలు నిర్వహించింది. డీఎస్సీ-2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా.. డీఎస్సీ-2018లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, ఎంపిక ప్రక్రియ చేపట్టింది. కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో పడడంతో ఈ ప్రభుత్వం వచ్చాక 7,254 పోస్టులను భర్తీ చేసింది. డీఎస్సీ-2018పై ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతగా జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ఖాళీలు చాలా తక్కువని, పాఠశాల విద్యలో 23వేలు ఖాళీలు ఉన్నాయంటూ నిరుద్యోగుల ఓట్ల కోసం ప్రేమ కురిపించారు.
అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని ఊదరగొట్టారు. ఆయన్ని నమ్మిన నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. పోస్టులు ఉంటే భర్తీ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. 7,752 పోస్టులు రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ప్రపంచబ్యాంకు నుంచి రూ.1,838.75కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణం కోసం భవిష్యత్తులో మానవవనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామనే నిబంధనను ప్రభుత్వం పెట్టుకుంది.
ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లనే సర్దుబాటు చేసి, కొత్త నియామకాలు లేకుండా చేస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్రంలోని యువత జీవితాలను పణంగా పెట్టింది. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపైనే ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 20న శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 771పోస్టులే ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల ఖాళీలు రాలేదంటూ గొప్పలు చెప్పారు.
సెప్టెంబరు 22న శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో అదే మంత్రి బొత్స 8,366 పోస్టులు అవసరం ఉందంటూ ప్రకటించారు. కేవలం 6నెలల్లోనే 7,595 ఖాళీలు పుట్టుకొచ్చాయి. అవసరమైతే ఖాళీలు పెరగడం.. లేదంటే తగ్గించేయడం చేసే గారడీ ఈ ప్రభుత్వానికి తెలిసినట్లు ఇంకెవ్వరికి తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరు పోస్టులు 1,88,162 ఉండగా.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు 1,69,642మంది ఉన్నారు. ఈ లెక్కన 18,520 ఖాళీలున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం 8,366 పోస్టులే అవసరమని ప్రకటించింది. 3,4,5 తరగతుల విలీనం, 9,10 తరగతుల్లో సెక్షన్‌కు 60మందిని పెంచడం, హేతుబద్ధీకరణతో పోస్టులను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం పన్నాగం వేసింది.
కొత్త నియామకాలు చేపట్టకపోగా.. ఉన్న పోస్టులనే ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ బోధనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ఈ పోస్టులను రద్దు చేసేస్తోంది. కొత్తగా 692 ఎంఈఓ పోస్టుల కోసం 1,145, కమిషనరేట్‌లో 5 అదనపు డైరెక్టర్ పోస్టుల కోసం మరో 15 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను రద్దు చేసింది. ఆదర్శ పాఠశాలల్లో 3,260 టీచర్ పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసింది. హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ పాఠాలు బోధించేందుకు 1,752 స్కూల్ అసిస్టెంట్లను నియమించేందుకు 1,752 ఎస్జీటీ పోస్టులు రద్దు చేసింది. ఉమ్మడి కర్నూలులో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 SGT పోస్టులను విలీనం చేసింది.