మధ్యాహ్న భోజనం నాణ్యతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో... విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ఈ పథకం అమలవుతున్న తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లోపించకూడదని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకంలో తల్లిదండ్రుల కమిటీలను భాగస్వామ్యములు చేయాలని సూచించారు.
చిన్నారులకు బ్రిడ్జి కోర్సులు...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం, షూ... సకాలంలో అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాఠశాలలు తెరిచే నాటికి వీటన్నింటినీ అందించాలని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది 1 నుంచి ఆరో తగరతి వరకూ ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని నిర్ణయించినందునా... ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలను సన్నద్ధం చేసేందుకు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామని తెలిపిన అధికారులు... వీటి నిర్వహణపై ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జికోర్సులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రతిష్టాత్మక సంస్థలతో భాగస్వామ్యం...
పటిష్ఠమైన పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో... ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రమాణాలు తీసుకొస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గణితాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి చికాగో యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతుందన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల మాధ్యమం, బోధన తదితర అంశాల్లో బ్రిటిష్ కౌన్సిల్ భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఉత్తమ ఫలితాలనిచ్చే విద్యావిధానాలు, విద్యావ్యవస్థల అంశాల్లో సింగపూర్ ప్రభుత్వం సహకారం ఉంటుందని సీఎం వివరించారు. గొప్ప సంస్థలు, ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యం ప్రభుత్వ విద్యావ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకొస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి