Document Writers Agitation Programs at Sub-Registrar Offices: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 ని తక్షణమే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు (Document writers) ఆందోళనబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రైటర్లు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో దొంగ డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయబడ్డారు. ఈ-స్టాంప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా నిర్వహించారు. నూతన విధానంతో లక్షల మంది జీవోనాపాధిని కోల్పోయో పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో దస్తావేజు లేఖర్లు (Document writers) నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(Sub-Registrar Office) ఎదుట నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం వలన డాక్యుమెంట్ రైటర్ల మనుగడకే ముప్పు ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా నేడు, రేపు పెస్ డౌన్ కార్యక్రమం ద్వారా విధులకు దూరంగా ఉండి.. నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల వ్యవహారం
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైమ్ 2.0 కొత్త సాఫ్ట్‌వేర్ అమలులోకి రావడంతో.. ప్రజలతో పాటు దస్తావేజు లేఖరులకు నష్టం జరుగుతుందంటూ... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో లేఖరులు పెన్ డౌన్ పాటించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. పూర్వం నుంచి చలామణిలో ఉన్న స్టాంపు పేపర్లు ఇక ముందు కనిపించవన్నారు. వాటి స్థానంలో ప్రభుత్వం కొత్తగా ఈ- స్టాంపులను తీసుకొచ్చిందన్నారు. వీటి వినియోగంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఈ విధానం సరైంది కాదంటూ దస్తావేజు లేఖరులు, సహాయకులు, స్టాంపు వెండర్లు ఆందోళన చేశారు.
'ఇక మీ దస్తావేజును మీరే తయారు చేసుకోవచ్చు'
గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రైటర్లు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో దొంగ డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయబడ్డారు. ఈ-స్టాంప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బాపట్ల జిల్లా చీరాలలో దస్తావేజు లేఖర్లు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 రిజిస్ట్రేషన్ జీవోను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా స్టాంపు రైటర్లు ఆందోళన చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్‌కి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కనిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన గేటుకు అడ్డంగా దస్తావేజు లేఖర్లు నిలబడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 2.0 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలుపుదల చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్ ద్వారా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకు వస్తున్న 2.0 నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నూతన విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు వారి అనుబంధ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు(Stamp vendors) పెన్ డౌన్ పేరుతో తమ విధులకు స్వస్తి పలికారు. ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్ లకు కొత్తగా ప్రకటించిన జీవో తో తమ వృత్తికి గండి పడుతుందని.. ఈ జీఓను ఉపసంహరించుకోవాలని కోరారు.