గుంటూరు జిల్లా తెనాలిలో కొవిడ్ చికిత్స అందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లను అక్కడ సిబ్బంది చేతివాటం చూపుతూ అమ్ముకుంటున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ అవ్వటంతో పుల్లయ్య, చైతన్య అనే ఇద్దరు అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జిల్లా ఆసుపత్రిలో అత్యవసరమైన సిటీ స్కానింగ్‌ను మూడు రోజుల్లో మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొవిడ్ బాధితులకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అవకాశం కల్పించే విధంగా ఆలోచిస్తున్నామని సబ్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రత్యామ్నాయంగా మరికొన్ని బెడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. కొవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. సూపరింటెండెంట్ సనత్ కుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ఏలూరు నుంచి గుంటూరుకు శరవేగంగా ఆక్సిజన్ తరలింపు