తెలంగాణ సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి మూడ్రోజుల క్రితం ఒక వ్యక్తి అర్ధరాత్రి చొరబడ్డాడు. ఈ విషయాన్ని స్మితా సబర్వాల్ స్వయంగా ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి తన ఇంట్లోకి ఓ చొరబాటు దారుడు రావటం.. అత్యంత బాధాకరమని స్మితా సబర్వాల్ నిన్న ట్వీట్ చేశారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి అతని నుంచి తనను తాను కాపాడుకున్నానని తెలిపారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నామని భావించిన తలుపు, తాళాలు సరిగా వేసి ఉన్నాయో లేదో అన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేయాలన్న గుణపాఠం నేర్చుకున్నట్టు వివరించారు.
‘ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. రాత్రివేళ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. నేను సమయస్ఫూర్తితో వ్యవహరించి నా ప్రాణాన్ని కాపాడుకున్నా. ఎంత భద్రత నడుమ ఉన్నాం అనుకున్నా.. ఇంటి తలుపులు, తాళాలను స్వయంగా తనిఖీ చేసుకోవాలి..అత్యవసరమైతే డయల్ 100కు ఫోన్ చేయాలని పాఠం నేర్చుకున్నా’ - స్మితా సబర్వాల్, సీఎంవో అధికారి
- సంబంధిత కథనం : స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబాటుపై పోలీసుల దర్యాప్తు
ఈ వ్యవహారంపై పోలీసు నిఘా వర్గాలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని ప్లజెంట్ వ్యాలీ బి-11లో ఆమె నివసిస్తున్నారు. ఇక్కడే నగర పోలీసు కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు నివసిస్తుండడంతో నిరంతరం పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి (48), అతడి స్నేహితుడైన హోటల్ నిర్వాహకుడు కొత్త బాబుతో కలిసి కారులో ఈ నెల 19న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్లజెంట్‌వ్యాలీ వద్దకు వచ్చారు.
బి-17కు వెళ్లాలంటూ సెక్యూరిటీ గేటు వద్ద సిబ్బందికి చెప్పి, నేరుగా స్మితా సభర్వాల్ నివాసం (బి-11) వద్దకు చేరుకున్నారు. బాబు కారులో ఉండగా, ఆనంద్‌కుమార్‌రెడ్డి ఆమె ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు తట్టాడు. నివ్వెరపోయిన ఆమె వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఈలోగా భద్రతా సిబ్బంది ఆనంద్‌కుమార్‌రెడ్డిని పట్టుకున్నారు. కాసేపటికి జూబ్లీహిల్స్ పోలీసులొచ్చి ఆనంద్‌ను, కారులో ఉన్న బాబును అదుపులోకి తీసుకొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 458, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. స్మితా సభర్వాల్ ఇంట్లోకి ప్రవేశించే ముందు.. రాత్రి 11.34 నిమిషాలకు ‘మీ ఇంటి గుమ్మం వద్ద ఉన్నా’ అంటూ ఆమెకు ఆనంద్ ట్వీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆనంద్‌కుమార్‌రెడ్డి గతంలో చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పాత్రికేయుడిగా పనిచేసినట్లు గుర్తించారు. గ్రూపు-2లో ఎంపికై 2018లో హైదరాబాద్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై పౌరసరఫరాల విభాగంలో పనిచేస్తున్నారు. శామీర్‌పేటలోని అలియాబాద్‌లో ఆనంద్‌కుమార్‌రెడ్డి, బాబు ఒకే భవనంలో కింద, పైన అంతస్తుల్లో నివసిస్తున్నారు.
ఇవీ చదవండి :