బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన, వనరుల సమీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో ఉప సభాపతితో జేసీ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ మయూరి అశోక్ సమావేశమయ్యారు. నూతన జిల్లా ఏర్పాటుకు సంబంధిచి ఆస్తులు, మౌలిక వసతులు, ఇతర అంశాలపై చర్చించారు. చరిత్రపరంగా, విద్యా కేంద్రంగా ఉన్న విశిష్టత, పరిశోధనా కేంద్రాల వివరాలను జేసీకి రఘుపతి వివరించారు.
ఈ సందర్భంగా ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ.. బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావాలని ఐదు దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ఉన్న 15 ఎకరాల స్థలంలో.. ప్రస్తుతం ఉన్న కార్యాలయాల పాత భవనాలు తొలగించి, కొత్తగా బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు వివరించారు. సబ్‌జైలును స్టూవర్టుపురంకు తరలించాలనీ.. పది ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా ఉప కారాగారానికి భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. కొత్త జిల్లా ఏర్పాటునకు స్థానికంగా ఉన్న వసతులు, ఆస్తులు, మానవ వనరులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికినివేదిక సమర్పిస్తారన్నారు.
జేసీ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా పునర్విభజనపై నాలుగు సబ్ కమిటీలను కలెక్టర్ నియమించినట్లు వివరించారు. సబ్ డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఏర్పాటు కోసం తాత్కాలిక, మధ్యతరహా, దీర్ఘకాలికంగా కల్పించాల్సిన మౌలిక వసతులు, ఆస్తుల విభజన, అందుబాటులో ఉన్న వనరుల సంపూర్ణ వినియోగంపై అధ్యయనం చేసి.. సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు. త్వరలోనే ప్రజా ప్రతినిధులు, స్థానికులు, అన్ని సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: కరోనా మరణాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానం