గ్యాస్, ముడి చమురు ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు.. ఆందోళనలు చేపట్టాయి. గుంటూరు శంకర్ విలాస్ కూడలిలో రహదారిపై కట్టెలపొయ్యి వెలిగించి సీపీఐ, సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ధరలు పెంచడం వల్ల పేద, మధ్య తరగతిపై మోయలేని భారం పడుతోందని మండిపడ్డారు. నరసరావుపేటలో ఏంజల్ టాకీస్ వద్ద సీపీఐ ధర్నా చేసింది. కృష్ణా జిల్లా నందిగామలో వామపక్షాల నాయకులు.. తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. నూజివీడు, మైలవరంలోనూ ధర్నాలు చేశారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద సీపీఐ, సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి వన్ టౌన్‌కు తరలించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. జీఎస్టీ పరిధిలోకి ముడిచమురును తేవాలని డిమాండ్ చేశారు. యర్రగొండపాలెంలో.. అంబేడ్కర్ కూడలిలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనాలను నడుపుతూ సీపీఐ, సీపీఎం నేతలు ర్యాలీ నిర్వహించారు. ధరలు నియంత్రించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలులోనూ నిరసనలు మిన్నంటాయి. సుందరయ్య సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పత్తికొండలో ద్విచక్ర వాహనానికి శవయాత్ర నిర్వహించారు. తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి.
కడపలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. బద్వేలులో సీపీఐ నేతలు కారును తాడుతో లాగుతూ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ధరలను తగ్గించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి:
janasena: దేశంలో డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా.. మూలాలు ఏపీలోనే : జనసేన