కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. ఈ ఆకస్మిక పరిణామం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులకు పెద్ద పిడుగే. తొమ్మిదో తరగతి వరకూ విద్యార్థులందరికీ పరీక్షలు రద్దు చేసింది. జులైలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. అలాగే ఆగస్ట్ 3వ తేది నుంచి విద్యా సంవత్సరం మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ తరుణంలో తమ పిల్లలను బడికి పంపేందుకు ఎంతమంది తల్లిదండ్రులు ముందుకు వస్తారనేది సందేహమే. ఈపరిస్థితుల్లో పాఠశాల నిర్వహించటం కత్తిమీద సాములాంటిదే అని యాజమాన్యాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే పాఠశాలలో పారిశుధ్యం తప్పనిసరి. విద్యార్థులు వచ్చే సమయంలో శరీర ఉష్ణోగ్రత తనిఖీ చేయటం, పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల్లో తరచుగా క్రిమిసంహారక మందులు చల్లటం వంటి పనులు చేపట్టాలి. తమ సిబ్బంది మొత్తానికి వైరస్ నియంత్రణ ఉపకరణాలు అందజేయాలి. ఇవన్నీ కూడా యాజమాన్యాలకు అదనపు భారమే. ఎన్ని యాజమాన్యాలు వీటిని భరిస్తాయనేది ప్రశ్నార్థకమే. విద్యా సంవత్సరం మొదలు కాగానే ఉపాధ్యాయుల జీతాలు, పాఠశాల భవనాల అద్దెలు, గదుల మరమ్మతులు ఇలా బోలెడు ఖర్చులు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడక.. విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా పడితే అందుకూ సన్నద్ధం కావాలి. ఆన్ లైన్ తరగతుల కోసం ఏర్పాట్లు చేసుకోవాలి.
యాజమాన్యాల బాధలు ఒకలా ఉంటే తల్లిదండ్రుల సమస్యలు అంతకు మించి ఉన్నాయి. తమ పిల్లలను పాఠశాలకు పంపే ధైర్యం చేయలేకపోతున్నారు. తమ పిల్లలను కరోనా నుంచి రక్షించుకునేందుకు మాస్కులు, గ్లౌజులు, ఫేస్ షీల్డులు వంటివి వాడటం తప్పనిసరి. వాటి ఖర్చు తల్లిదండ్రులకు అదనపు భారం కానుంది. ఇక బడి ఫీజులు చెల్లించే పరిస్థితి ఉందా అంటే దాదాపు అందరూ తెల్లమొఖం వేసే పరిస్థితి. కరోనా ప్రభావంతో ఎగువ, దిగువ మధ్య తరగతి వాళ్లంతా దాచుకున్న డబ్బులు అయిపోయి కుటుంబ నిర్వహణకు అప్పులు చేసిన పరిస్థితి. ఈ తరుణంలో ప్రైవేటు ఉద్యోగులు, డ్రైవర్లు, చిరు వ్యాపారులు పిల్లలకు ఫీజులు చెల్లించటం గగనమే.
ఆన్ లైన్ విధానం అనే మాట అందరూ అంటున్నారు. కానీ ఆన్ లైన్ బోధన అనేది తరగతి గది బోధనకు ఏమాత్రం సరితూగదు. ఇక ఆన్ లైన్ తరగతులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకోవటం అందరికీ సాధ్యమయ్యే పనికాకపోవచ్చు. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకోవాలి. ఇద్దరు పిల్లలుంటే రెండు ఫోన్లు ఉండాలి. ఒకవేళ స్మార్టు ఫోన్లు ఉన్నా నెట్ వర్క్ సమస్యలు, డేటా వినియోగం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పట్టణాల్లో అయితే సరే... గ్రామాల్లోని ప్రైవేటు స్కూళ్ల సంగతేంటి. ఇవన్నీ ఎదురుకానున్న సమస్యలు.
అంతర్జాతీయంగా కోవిడ్ వ్యాప్తిని నిశితింగా పరిశీలిస్తే వైరస్ ప్రభావం కనీసం ఆరేడు నెలలు ఉన్నట్లు అర్థమవుతోంది. అంటే ఈ ప్రకారం మనదేశంలో సెప్టంబర్, అక్టోబర్ వరకూ పరిస్థితిలో మార్పు రాకపోవచ్చు. మరి అప్పటి వరకూ ఎలా. అటు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఇటు ఉపాధ్యాయులు, మరోవైపు ప్రైవేటు యాజమాన్యాలు అందరూ చర్చించి సరైన విధానం అమలు చేయాలి.
ఇదీ చదవండి: బడ్జెట్ 2020 - 21 ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి