గుంటూరు జిల్లాలో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 244 కేసులు, మంగళవారం 236 కేసులు నమోదు కాగా... జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2,679కు చేరింది. ముఖ్యంగా గుంటూరు నగరంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో తూర్పు నియోజకవర్గంలో కేసులు రాగా.. .ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి వైరస్ విస్తరించింది.
వేగంగా విస్తరణ
గుంటూరులో సోమ, మంగళ వారాల్లో 281 కేసులు బయటపడ్డాయి. తాజాగా తాడేపల్లి 24, తెనాలి 21, మంగళగిరి 8, దాచేపల్లి, వినుకొండలో 7 చొప్పున నమోదయ్యాయి. మాచర్ల, పెదకాకాని, గురజాలలో 4 కేసుల చొప్పున, తుళ్లూరులో 3 కేసులు వెలుగుచూశాయి. దాచేపల్లి, మాచర్ల ప్రాంతాలను కరోనా పట్టిపీడిస్తోంది. తాడేపల్లి, సత్తెనపల్లి, తెనాలిలో కేసుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. గురజాల, వినుకొండ ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. మరణాల రేటును అడ్డుకోవడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో వృద్ధుల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించి... డేటాను తయారుచేయాలని సిబ్బందికి జిల్లా ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు.
నిబంధనలు కఠినతరం
కంటైన్మెంట్ జోన్లలో కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని.. మాస్కు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచించారు. ఒక్క జిల్లాలోనే లక్ష నమూనాలు పరీక్షించామని.. భవిష్యత్తులో పరీక్షలను వేగవంతం చేస్తామని డీఎంఎచ్ఓ యాస్మిన్ చెప్పారు..
జూన్, జులై నెలల్లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ డిశ్చార్జ్ శాతం ఆశాజనకంగా ఉండటం ఉపశమనం కలిగిస్తోంది. ముప్పు పొంచి ఉన్న 60 ఏళ్ల వృద్ధుల సంరక్షణపైన జిల్లా యంత్రాంగం ప్రధానంగా దృష్టి సారించింది.
ఇవీ చదవండి...