గుంటూరు జిల్లా నుంచి ఇప్పటివరకు రైళ్లు, బస్సుల ద్వారా 90 వేల మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించినట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన 3 రిలీఫ్ సెంటర్లలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సౌకర్యాలపై వలస కూలీలతో మాట్లాడి తెలుసుకున్నారు. బొప్పూడి వద్ద ఏర్పాటు చేసిన రిలీఫ్ సెంటర్లో కళ్యాణ మండపం వరండాలో వలస కూలీలను ఉంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కళ్యాణ మండపం లోపలే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఫార్ కార్నర్ వద్ద ఉన్న రిలీఫ్ సెంటర్ వద్దకు కలెక్టర్ చేరుకున్నారు. అక్కడ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినితో కలిసి కూలీలకు భోజనాలు వడ్డించారు. వలస కూలీల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్యేను, స్వచ్ఛంద సంస్థలు, దాతల సేవలను ఆయన కొనియాడారు.