రాజధాని ప్రాంతం తుళ్లూరులో మహా ధర్నా కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది. తుళ్లూరుతో పాటు దొండపాడు, బోరుపాలెం, నేలపాడు, నెక్కల్లు గ్రామాల నుంచి రైతులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావటంతో విద్యార్థులు, చిన్నారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 'సేవ్ అమరావతి' నినాదాలతో మహా ధర్నా శిబిరం మారుమోగింది. రాజకీయాలు వద్దు... అమరావతి ముద్దంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. మోదీ చిత్రపటం చేతబట్టిన మహిళలు, చిన్నారులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. అమరావతిని పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించే వరకు తమ ఉద్యమం సాగుతుందని స్పష్టం చేశారు.
పెదకూరపాడులోనూ...
రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా పెదకూరపాడులోనూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. చిన్నా, పెద్దా అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతికి మద్దతుగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్తెనపల్లి-అమరావతి రహదారిపై బైఠాయించి వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి:అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు