గుంటూరు జిల్లా ప్రమాదరహిత ప్రయాణాలకు నిపుణులైన డ్రైవర్లను తయారు చేయడంలో భాగంగా ప్రజా రవాణాశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది. భారీ వాహనాల చోదక శిక్షణ పాఠశాలలు ఇప్పటికే గుంటూరు, నరసరావుపేట డిపోల్లో ప్రారంభమయ్యాయి. డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండడంతో పాటు వాహన చోదకంతో ఉపాధి పొందాలనే ఆశ ఉన్న వారి కల తీర్చేందుకు ఈ శిక్షణ పాఠశాలలు దోహదం చేసేలా ఉన్నాయి. అత్యాధునిక ప్రమాణాలతో కూడిన శిక్షణను ఇందులో ఇస్తున్నారు. 40 రోజుల శిక్షణకు తొలి బ్యాచ్‌కు ఎంపికైన ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15వేలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. బ్యాచ్‌కు 16 మంది చొప్పున ఎంపికయ్యారు. గుంటూరు, నరసరావుపేట డిపోల్లో 32 మంది గత పది రోజులుగా శిక్షణ పొందుతున్నారు. 40 రోజుల ప్రత్యేక శిక్షణలో 32 పని దినాలు ఉంటాయి. ఇందులో 16 పని దినాల్లో థియరీ(పాఠాలు), మరో 16 దినాలు ప్రాక్టికల్ (వాహన చోదక) శిక్షణ ఇవ్వనున్నారు. వాహనం నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నచిన్న మరమ్మతులకు వేరొకరిపై ఆధారపడకుండా వారే పూర్తి చేసుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు.
డ్రైవింగ్ స్కూల్స్‌కు ప్రిన్సిపల్‌గా ఆయా డిపోల డీఎంలు వ్యవహరిస్తున్నారు. ఎంఎఫ్(మెకానిక్), సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్రక్టర్స్ ఇద్దరు, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు పని చేస్తున్నారు. విడిభాగాలు, ఇంజిన్లు, ఇతర పరిరకాలను ప్రత్యక్షంగా చూపించి శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక బస్సుల్ని రూపొందించారు. మొదటివిడత శిక్షణ పూర్తవ్వకముందే గుంటూరు, నరసరావుపేటలో రెండో బ్యాచ్ శిక్షణకు సిద్ధం చేశారు. బాపట్ల డిపోలో ఈ వారంలోనే తొలి విడత శిక్షణ ప్రారంభించబోతున్నారు. భవిష్యత్తులో ప్రజా రవాణా శాఖలోని అవసరాలకు వీరి సేవల్ని ఉపయోగించుకోనున్నారు. సమాజానికి సుశిక్షితులైన డ్రైవర్లను అందజేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఆర్‌ఎం రాజశేఖర్ పేర్కొన్నారు. ఔత్సాహికులు దరఖాస్తు చేసుకొని శిక్షణతో ఉజ్వల భవిత పొందాలని ఆయన కోరారు.