గుంటూరు జిల్లా నూజెండ్ల మండల పరిధిలోని కొత్త నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు దారుణానికి తెగబడ్డారు. నిద్రిస్తున్న వృద్ధుడిపై పెట్రోల్ పోసి కిరాతకంగా సజీవ దహనం చేశారు. గ్రామానికి చెందిన కర్లకుంట గురవయ్య తన ఇంటి ఆరు బయట నిద్రిస్తుండగా దుండగులు అతని ఒంటిపై పెట్రోలు పోసి తగలబెట్టారు. బాధితుడి ఆర్తనాదాలు గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.
మార్గమధ్యలోనే..
శరీరమంతా పూర్తిగా కాలిపోయిన గురవయ్యను 108 అంబులెన్స్ సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుంటూరు జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్స్ ద్వారా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అయినవోలు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : అక్రమంగా తరలిస్తున్న 300కిలోల గంజాయి పట్టివేత