గుంటూరు నగరానికి నడిబొడ్డున... 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియానిది ఘనమైన చరిత్ర. 1967లో నిర్మాణమైన ఈ మైదానం... ఐదు దశాబ్దాలుగా ఎందరో మేటి క్రీడాకారులను దేశానికి, రాష్ట్రానికి అందించింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ అథ్లెట్ సత్తి గీత వంటి క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు దిద్దారు. పీటీ ఉష, అశ్వనీ నాచప్ప వంటి అథ్లెట్లు ఇక్కడ సత్తాచాటారు. 1980-1990 మధ్య పలు క్రికెట్ రంజీ మ్యాచ్‌లకు వేదికైంది. వివిధ క్రీడల్లో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు బీఆర్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. ఇక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టి గుంటూరు ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన క్రీడాకారులు చాలా మందే ఉన్నారు.
ఇంతటి ఘనకీర్తి ఉన్న బీఆర్ మైదానం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆలనాపాలనా చూసేవారు లేక అనాథగా మిగిలింది. ఎప్పుడో కట్టిన గ్యాలరీలు పూర్తిగా శిథిలమైపోయాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవు. చిన్న వర్షం వస్తే చాలు మైదానం నీటితో నిండిపోతోంది. మైదానం నిండా నీరు చేరడంతో క్రీడాకారులే కాదు.. వాకర్లు సైతం రావడం మానుకున్నారు. కరోనా దెబ్బతో కూరగాయల వ్యాపారులకు క్రీడామైదానం వేదికగా మారింది. ఎంతో ప్రతిష్ఠాత్మనకమైన ఈ మైదానం ఈ స్థితికి చేరడం పట్ల క్రీడాభిమానులు, మాజీ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విభజన తర్వాత రాష్ట్రంలో సరైన క్రీడామైదానాలు, మౌలిక సదుపాయాలు కరవై క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు గత ప్రభుత్వం బీఆర్ స్టేడియాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో పునర్నిర్మించాలని నిర్ణయించింది. ఒకే స్టేడియంలో ఇండోర్, ఔట్ డోర్ మైదానాలు కలిసుండే విధంగా అహ్మదాబాద్‌లో నిర్మించిన నమానాను అధికారులు, ప్రజాప్రతనిధులు పరిశీలించారు. కేరళ తిరువనంతపురం, ముంబయిలో నిర్మించిన అధునాతన మైదానాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని ఆధునిక హంగులతో మైదానాన్ని... 270 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్రీడామైదానాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 లక్షల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారన్న సమాచారాన్ని చెప్పేందుకు క్రీడా, యువజన వ్యవహారాల శాఖాధికారులు నిరాకరిస్తున్నారు.
ఇదీ చదవండి: