వైకాపా ఎమ్మెల్యేలు కొంతమంది హిందూమతాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తుంటే.. సీఎం మౌనం వహిస్తున్నాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఏమి మాట్లాడట్లేదంటే వారిని ప్రోత్సహిస్తున్నట్టేనని దుయ్యబట్టారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలన్న పొద్దుటూరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా.. భారతీయులను కించపరస్తారా ? అని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి లేదా నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన వారిని, దేవాలయాలపై దాడులు చేసిన దోషులను శిక్షించకుండా.. రథం, విగ్రహాలు ఏర్పాటు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదన్నారు. దేవాలయాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. జెరూసలేం, మక్కా వెళ్లేవారికి ప్రభుత్వ సాయం అందిస్తోందని...అలానే తిరుపతి వెళ్లడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైకాపా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కార్పొరేషన్లకు నిధులు, విధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వెల్లంపల్లి దర్గాల మంత్రిగా ఉన్నారు తప్ప.. ఆయనకు దేవాదాయ శాఖపై అవగాహన లేదని అన్నారు.
ఇదీ చూడండి. uppalapadu bird sanctuary: ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి