బిల్డ్ ఏపీ కోసం ప్రభుత్వ భూములు అమ్మాలనే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. భవిష్యత్ తరాల కోసం ఉంచిన భూములు ఎలా విక్రయిస్తారని లేఖలో ప్రశ్నించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన భూములను విక్రయించటం సరికాదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే వైకాపా ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ప్రజాకర్షక పథకాల నిధుల కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఆస్తులు అమ్మితే వచ్చే నిధులతో నవరత్నాల వంటి పథకాలు అమలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. వెంటనే గుంటూరు, విశాఖపట్నంలో భూముల అమ్మకాల ప్రక్రియ ఆపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: జూన్ 30 వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లు రద్దు