తెదేపాకు ఓటేయడానికే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని ఊహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... హైదరాబాద్‌లోని కూకట్పల్లి బస్టాండ్ మూసేయించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి బస్సులు రద్దు చేసిన విషయాన్ని పార్టీ కార్యకర్తలతో సమీక్షలో గుర్తుచేశారు. అయినా.. ఆటోలో హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చి మరీ ప్రజలు ఓటేశారని చెప్పారు. కేసీఆర్‌పై కసితో తెదేపాకు ఓటేయడానికి హైదరాబాద్ నుంచి ఓటర్లు భారీగా తరలివచ్చారన్న చంద్రబాబు... వాళ్లకు అక్కడ ఇబ్బంది వస్తుందని తాను పిలుపివ్వలేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీతో మొదట్లోనే గొడవ పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోయేదని చంద్రబాబు వివరించారు. ఓపిగ్గా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద ప్రధానికే వచ్చిందని పేర్కొన్నారు. అందుకే ఎప్పుడు పెట్టుకోవాలో అప్పుడే పెట్టుకున్నామని చెప్పారు. ముందే బయటికొస్తే... మోదీ వేధింపులు మరింత పేట్రేగేవన్న చంద్రబాబు... ఈ ఎన్నికల్లో ఇంతమంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. కార్యకర్తల సమష్టి కృషి... ఓటర్ల పట్టుదలే దీనికి కారణమని కొనియాడారు.
మన పోరాటం వ్యవస్థల కోసం...
తెదేపా రాష్ట్రం.. దేశం... వ్యవస్థల కోసం పోరాటం చేస్తుంటే... వైకాపా స్వార్థం, పదవి, కేసుల మాఫీ కోసం ఆరాటపడుతుందని పేర్కొన్నారు. వచ్చే రెండుమూడు సీట్లకు... జగన్ అప్పుడే బేరాలు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీలందరికీ న్యాయం చేశామని ఉద్ఘాటించారు. తెలంగాణ కన్నా రూ.50 వేలు ఎక్కువ రైతులకు రుణమాఫీ చేశామన్న అధినేత... వ్యవసాయ అభివృద్ది తెలంగాణలో 0.2 శాతం ఉంటే... రాష్ట్రంలో 11 శాతం వృద్ధి సాధించామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ కన్నా.. మనమే మిన్నా...
తెలంగాణలో పింఛను రూ.1,000 ఉంటే... రాష్ట్రంలో రూ.2వేలు ఇస్తున్నామని... భవిష్యత్తులో 3వేలకు పెంచుతామని చెప్పారు. తెలంగాణలో మహిళలకు పసుపు కుంకుమ లేదు... యువతకు నిరుద్యోగ భృతి లేదన్న చంద్రబాబు... ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కన్నా లోటు బడ్జెట్లో ఎంతో సాధించామని ఉద్ఘాటించారు. 730పైగా అవార్డులను సాధించామన్న అధినేత... అధికారుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేదే తన సంకల్పమని స్పష్టం చేశారు.