Atchannaidu Fired on CM Jagan : టీడీపీ హయాంలో బీసీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలో 'బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి' పుస్తకం ఆవిష్కరణ చేశారు. వైసీపీ పదవుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఒక సామాజిక వర్గానిదే అసలైన అధికారం ఉందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ సలహాదారు విషయంలో కోర్టు వద్దని చెప్పినా అనేక మంది సలహాదారులను నియమించారని అన్నారు. వైసీపీ నియమించిన సలహదారుల్లో ఎంత మంది బీసీలు ఉన్నారని ప్రశ్నించారు. సలహాదారులుగా బీసీలు పనికిరారా అని నిలదీశారు. జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పుస్తకంలో ఉన్న అంశాలు : వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 36 సంక్షేమ పథకాలు రద్దు చేశారని పుస్తకంలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన 14 లక్షల అసైన్డ్ భూముల్లో అత్యధిక భాగం బీసీలదేనని పుస్తకంలో ప్రస్తావించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించి.. దాదాపు16 వేలకుపైగా రాజ్యాంగ బద్ధమైన పదవుల నుంచి దూరం చేశారని వివరించారు. 13 బీసీ భవనాలు, 1,187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు నిలిపివేశారన్నారు. దాదాపు 75 వేల 760 కోట్ల రూపాయల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని వెల్లడించారు.
దళితులపై దాడులు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా?: ఎంఎస్ రాజు
రాబోయే ఎన్నికల్లో వైసీపీని బొంద పెట్టడమే బీసీలందరి ఏకైక లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఐదు ముక్కలు చేసి జగన్ తన బంధువులకు అప్పగించారని మండిపడ్డారు. వైసీపీ సర్కారు పట్ల బీసీల భ్రమలు వీడాలన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించగా.. అందులో కొల్లు రవీంద్ర, ఇతర సీనియర్ బీసీ నేతలు పాల్గోన్నారు.
తెలుగుదేశం స్థాపనతో ఎన్టీఆర్ బీసీలకు కల్పించిన స్వర్ణయుగాన్ని.. జగన్మోహన్ రెడ్డి కాలరాశాడని టీడీపీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి బలహీనవర్గాలు అండగా నిలుస్తున్నాయనే.. వారిపై కక్షపెంచుకుని దాడుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత.. 74మంది బీసీలు హత్యకు గురయ్యారని, 3వేల మందికి పైగా దాడులకు గురయ్యారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీకి అండగా నిలవటమే బీసీలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకే మినీ మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం పెట్టామని గుర్తు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా కులగణన చేపడతామని స్పష్టం చేశారు.
"వైసీపీ పాలనలో రాష్ట్రంలో బలహీనవర్గాలపై జరిగిన దమనకాండ.. బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి పుస్తకంలో పొందుపరిచారు. అచరణ కానీ తప్పుడు హామీలను ఇచ్చి ప్రజలను తప్పుతోవ పట్టించి.. 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. మంజూరైన పరికరాలు తుప్పు పట్టి పోతున్నాయి. వాటిని పంచడానికి మనసు రాని ముఖ్యమంత్రి ఎలా నా బీసీలని అంటాడు." -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
'జగన్ పునాదులు కదులుతున్నాయనే ఆందోళనతో టీడీపీ నేతల అక్రమ అరెస్టులు'