Appointment of Staff for Jagan Party Work With People Money: గ్రామ, వార్డువాలంటీర్లకు శిక్షణనిచ్చేందుకు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశామన్న పేరుతో ఏటా 68 కోట్ల ప్రజాధానాన్ని దోచిపెడుతూ, మండలానికో ఏజెంటును పెట్టుకుని పార్టీ పని చేయించుకుంటున్న జగన్ ప్రభుత్వం దాన్ని మరింత విస్తరిస్తోంది. ప్రజల సొమ్ముతో జీతాలిస్తూ పార్టీ, ఎన్నికల పనులు చేయించుకునే కుట్రను మరింత విస్తృతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది. దానిలో టీమ్‌లీడర్, డేటా ఎనలిస్ట్ పోస్టుల్లో నియమితులయ్యేవారు చేయాల్సిన పనుల్ని, వారికి నిర్దేశించిన అర్హతల్ని చూస్తే జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో బరితెగించిందో అర్థమవుతుంది.
టీమ్‌లీడర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి రాజకీయ విశ్లేషణ, ఎలక్షనీరింగ్‌లో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలని అందులో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియపై అవగాహన, ఎన్నికల సంఘం నిబంధనలు, విధానాలపై పరిజ్ఞానం కూడా కావాలంది. ఆ పోస్టుకు ఎంపికైన వ్యక్తి డేటా ఎనలిస్ట్, మానవవనరులు, ఎన్నికల మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, పబ్లిసిటీ, ఎవేర్‌నెస్ విభాగాల్ని పర్యవేక్షించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ, ప్రచారాల్ని పర్యవేక్షించడం, ఎన్నికల సమయంలో వివిధ జిల్లాల అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని అవసరమైనవారికి చేరవేయడం లాంటివి ఆ వ్యక్తి చేయాలి.
వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించి, దాన్ని విశ్లేషించి, దాని ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విభాగాధిపతికి చేదోడువాదోడుగా ఉండటం, ఆయన నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బృందాన్ని నడిపించడం టీమ్ లీడర్ ప్రధానవిధిగా పేర్కొన్నారు. ఇక డేటా ఎనలిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి రాజకీయ, విధాన నిర్ణయాలు, ఎలక్షనీరింగ్‌కి సంబంధించిన డేటా విశ్లేషణలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని టీమ్‌లీడర్‌కి చేరవేయడం, విశ్లేషించడం ప్రధాన పనిగా పేర్కొన్నారు.
Bus shelters Demolition: బస్ షెల్టర్లు కూల్చివేత.. ప్రజాధనం దోచేస్తున్నారని ఆరోపణలు
ఏపీయూఐఏఎంఎల్(APUIAML) అనేది పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు పెట్టుబడుల సమీకరణ, ప్రాజెక్టుల నిర్వహణ, పట్టణ, పారిశ్రామిక, సామాజిక, పర్యాటకరంగాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పన కోసం 2016లో ఏర్పాటుచేసిన కంపెనీ. దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి 49శాతం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్(IL&FS) సంస్థకు 51శాతం వాటాలున్నాయి. మౌలిక వసతుల ప్రాజెక్టులపై పనిచేసేందుకు ఏర్పాటైన కంపెనీలో టీమ్‌లీడర్‌గా పనిచేసే వ్యక్తికి ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, ఎన్నికల సంఘం నిబంధనలపై అవగాహన, అనుభవం ఎందుకో అర్థంకాని పరిస్థితి. డేటా ఎనలిస్టుకు ఎన్నికల ప్రక్రియతో సంబంధమేంటో తెలియని పరిస్థితి. ఇదంతా చూస్తుంటే వైసీపీ కోసం పనిచేస్తున్న ఏ ఐప్యాక్ సిబ్బందినో ఆ కంపెనీలో నియమించి, వారికి ప్రజల సొమ్ముతో భారీగా జీతాలిస్తూ పార్టీ పని చేయించుకునే కుట్రకు జగన్ ప్రభుత్వం తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా
గ్రామ, వార్డు వాలంటీర్లంటేనే అధికారపార్టీ పనులకు, ప్రభుత్వానికి వేగుల్లా పనిచేసేందుకు ఏర్పాటుచేసిన వ్యవస్థన్నది అందరికీ తెలిసిందే. వారంతా వైసీపీ కార్యకర్తలేనని మంత్రులు, అధికారపార్టీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పారు. 2.33 లక్షల మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి నెలకు 5వేల గౌరవభృతి, ఏటా అవార్డులు, సాక్షి పత్రిక కొనడానికి డబ్బులు ప్రజాధనంతో చెల్లిస్తూ ప్రభుత్వం ఏటా వందల కోట్లు దోచిపెడుతోంది. అది చాలదన్నట్టు వారికి శిక్షణనిచ్చేందుకంటూ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో ప్రత్యేకవ్యవస్థను నెలకొల్పింది. రామ్ ఇన్ఫో లిమెటెడ్ అనే సంస్థను ఎఫ్‌ఓఏగా నియమించి ఏటా సుమారు 68 కోట్ల ప్రజాధనాన్ని దానికి కట్టబెడుతోంది.
ఎఫ్‌ఓఏ కింద రాష్ట్రవ్యాప్తంగా 800 మంది పనిచేస్తున్నారు. మండలానికి ఒకరి చొప్పున నియమించారు. వారికి మండలస్థాయి అధికారులు పేరుతో హోదా కూడా కల్పించారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ కొందరిని నియమించారు. జిల్లాస్థాయిలో పర్యవేక్షకులూ ఉంటారు. వారెవరో, ఏ ప్రాతిపదికన నియమించారో ఎవరికీ తెలియదు. వారు ఏ అధికారికి రిపోర్టు చేస్తారో కూడా తెలియదు. వైసీపీ కోసం ఎన్నికల వ్యూహాలు రూపొందించే ఐప్యాక్ సంస్థ సిబ్బందికే ఎంఎల్‌ఓల పేరుతో ఒక హోదా కల్పించి, ప్రభుత్వ సొమ్ముతో వారికి జీతాలిస్తున్నారన్న సందేహాలున్నాయి.