AP Sarpanches Complaint to Police on Financial Commission Funds: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల సంఘం నేతలు అన్ని జిల్లాల్లోని ఎస్పీలకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కనిపించకుండా పోయాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేయటమే కాకుండా కొన్ని జిల్లాల్లోని సర్పంచులు ఆందోళనలు సైతం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఆందోళనకు సిద్ధమౌతున్నట్లు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఇంటిని సైతం ముట్టడిస్తామన్నారు.
మచిలీపట్నంలో ఎస్పీకి ఫిర్యాదు..: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్పంచులకు తెలియకుండా పంచాయతీ ఖాతాల్లోని నిధులను దొంగిలించిన రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రాజకీయ పార్టీలకు అతీతంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. 2018 సంవత్సరం నుంచి గత సంవత్సరం వరకు గ్రామపంచాయతీలకు.. 8,660 కోట్ల రూపాయల అర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం అందించినట్లు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు, ఉచిత పథకాల పేరుతో దారి మళ్లించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామాల్లో మాలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిధులను తిరిగి గ్రామపంచాయతీల ఖాతాల్లో జమా చేయాలని కోరారు.
"రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ నిధులను దొంగిలించింది. దీనిపై ఎవరిని అడిగినా మాకు సమాధానం దొరకలేదు. ఆ నిధులు ఎలా వెళ్లిపోయాయి. సర్పంచులకు చెక్ పవర్ ఉన్న.. వారికి తెలియకుండా, వారి సంతకాలు లేకుండా నిధులు మాయమయ్యాయి." -సర్పంచి
"మా గన్నవరానికి గత సంవత్సరం నిధులు జమాయ్యాయి. అందులో కరెంటు బిల్లు పేరుతో నిధులను మళ్లించారు. దీనివల్ల గ్రామంలో శానిటేషన్ పనులు నిర్వహించలేకపోతున్నాము. అంతేకాకుండా వీదిలైట్లు, రోడ్లు వంటి మౌలికవసతులను కూడా కల్పించలేకపోతున్నాము." -సర్పంచి
అనకాపల్లి జిల్లాలో..: రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లో దొంగలు పడ్డారని.. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీముత్యాలరావు అనకాపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 8,660 కోట్ల రూపాయలను పంచాయతీ ఖాతాల నుంచి దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్థిక సంఘం నిధుల అపహరణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఎస్పీని కోరారు.
అనంతపురంలో..: గ్రామ పంచాయతీల నిధులను దొంగిలించిన వారిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయాలని.. అనంతపురం జిల్లాలోని సర్పంచులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. సర్పంచుల సంతకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులను కాజేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోనసీమ జిల్లాలో..: గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని.. కోనసీమ జిల్లాలో సర్పంచులు అమలాపురంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ భవనం వద్దనున్న అంబేడ్కర్ విగ్రహనికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి సర్పంచులు ఫిర్యాదు చేశారు.
నెల్లూరులో.. : పంచాయతీ ఖాతాల్లో దొంగలు పడ్డారంటూ.. నెల్లూరు జిల్లాలోని సర్పంచుల సంఘం నేతలు స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండానే పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి.. మాయమైన నిధులను తిరిగి గ్రామపంచాయతీలా ఖాతాల్లో జమాయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.