గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దాడులపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆమె అన్నారు. రాజకీయ కేసులన్నీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షిస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో 46 మందిపై రౌడీషీట్లు, 36 మందిపై సస్పెక్ట్ షీట్లు నమోదు చేశామని ప్రకటించారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌లు నిర్వహించామన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంలో ప్రజలు చేసిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
భద్రత కల్పిస్తాం
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయని సుచరిత తెలిపారు. పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై గురువాచారి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినందుకు గతంలో తెదేపా నేతలు వేధించారని ఆరోపించారు. గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయని తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సుచరిత అన్నారు. డబ్బులు ఇచ్చి కొందరిని పునరావాస కేంద్రాల్లో పెట్టారని ఆమె ఆరోపించారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తామని తెలిపారు. పోలీసులు పల్నాడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు సమీక్షిస్తారని అన్నారు. శిబిరాల్లో నిజంగా బాధితులు ఉంటే వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పల్నాడు ప్రశాంతం
రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు లేవన్నారు. పల్నాడు ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టంగా చెప్పారని సుచరిత అన్నారు.
ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్