High Court Questions To AP Government : లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు ఈనెల 28 న తమ ముందు విచారణకు హాజరుకావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వ శాఖలు, అధికారులు ఉన్నప్పుడు వాలంటీర్లను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించింది. వాలంటీర్లకు ఎలాంటి సర్వీసు నిబంధనలు లేవని, ఆ వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించింది.
ఆరు అంచెల విధానం.. సెర్ప్ సీఈవో : లబ్ధిదారులను గుర్తించే విషయంలో వాలంటీర్లకు పాత్ర లేదని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖ ప్రత్యేక కమిషనర్ కౌంటర్ దాఖలు చేశారని తెలిపింది. సెర్ఫ్ సీఈవో అందుకు భిన్నంగా కౌంటర్ వేస్తూ.. లబ్ధిదారులను గుర్తించేందుకు వాలంటీర్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారని తెలిపింది. లబ్ధిదారులను గుర్తించేందుకు ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నామన్నారని గుర్తు చేసింది. వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు ఈనెల 28 న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని సెర్ప్ సీఈవోను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన 26 మంది.. అనర్హులుగా గుర్తింపు : వైఎస్‌ఆర్ చేయూత పథకం కింద గతంలో లబ్ధిదారులగా ప్రయోజనం పొందామని, రాజకీయ కారణాలతో తమను అర్హతల నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్.వసంత లక్ష్మి మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.అరుణ్ శౌరి మంగళవారం వాదనలు వినిపించారు. గ్రామ స్థాయి లబ్ధిదారులను గతంలో పంచాయతీ కార్యదర్శి గుర్తించేవారని అన్నారు. రాజకీయ కారణాలతో ప్రస్తుతం వాలంటీర్లు లబ్ధిదారులను అనర్హులుగా పేర్కొంటున్నారన్నారు.
ఇవీ చదవండి