AP Government Approached Supreme Court: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా.. ఇంకా ఉమ్మడి ఆస్తుల విభజన జరగకపోవడం తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని అందుకే.. ఏపీ-తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పులు విభజించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లో పొందుపరిచిన హక్కులతోపాటు, విభజన అనంతరం రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను..కల్పించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాలకు సమానంగా, న్యాయమైన పద్ధతిలో వేగంగా ఆస్తులు, అప్పులను విభజించాలని విన్నవించింది. సమస్యను వేగవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేపదే కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయినట్లు పిటిషన్‌లో తెలిపింది.
షెడ్యూల్-3లో పేర్కొన్న 31 సంస్థలు, షెడ్యూల్10లోని 112 సంస్థలతో పాటు, చట్టంలో లేని 12 సంస్థల్లో ఏ ఒక్క దాన్నీ రెండు రాష్ట్రాల మధ్య ఇంతవరకూ పంపిణీ చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ మొత్తం ఆస్తుల విలువ లక్షా 42వేల 601 కోట్ల రూపాయల మేరకు ఉందని, వీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయకపోవడం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొంది. వీటిలో 91శాతం ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపింది. షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ దాదాపు 24వేల 18కోట్ల రూపాయల మేర ఉందని, ఇందులో 22వేల 556 కోట్ల ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపింది. షెడ్యూల్-10లో పేర్కొన్న ఆస్తుల విలువ 34వేల 642 కోట్ల రూపాయలు కాగా, అందులో 30వేల 530 కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉన్నట్లు వివరించింది. షెడ్యూల్ 9, 10ల్లో కానీ, చట్టంలో మరెక్కడా చూపని 12 సంస్థల ఆస్తుల విలువ 1,750 కోట్ల మేర ఉందని, ఇవి కూడా తెలంగాణలోనే ఉన్నాయని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఈ ఆస్తులను విభజించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతోందని తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, చాలా మందికి పదవీ విరమణ ప్రయోజనాలు దక్కని పరిస్థితి నెలకొందని.. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య న్యాయబద్ధంగా విభజించి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ పనుల కోసం అవసరమైన ఈ సంస్థలను విభజించక పోవడంవల్ల ప్రభుత్వ పని తీరుపైనా, ప్రజలపైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని కోర్టుకు వివరించింది. ఆస్తుల విభజనలో తెలంగాణ తీరు.. ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ప్రకటించడంతో పాటు, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించింది.
ఇవీ చదవండి: