Today CM Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరారు. ఉదయం నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం వివిధ అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని దృష్టికి తెచ్చిన సీఎం.. పోలవరం నిర్మాణ వ్యయం రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. విభజన హామీలు సహా అపరిష్కృత అంశాలు పరిష్కరించాలని, కొత్త వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం.. 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. సీఎం జగన్‌తో పాటు సీఎంవో అధికారులు, పలువురు ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు దిల్లీ వెళ్లారు. ఉదయం11.45 గంటలకు దిల్లీ చేరుకున్న.. మధ్యాహ్నం 12.45 గంటలకు 1-జన్‌పథ్ చేరుకున్నారు.
పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను సీఎం కలిశారు. దాదాపు 45నిమిషాల పాటు ఆయనతో జగన్ సమావేశం అయ్యారు. అమిత్ షాతో సమావేశం అనంతరం.. ప్రధాని మోదీతో.. ముఖ్యమంత్రి జగన్ గంటన్నరకుపైగా సమావేశం అయ్యారు. అనంతరం ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అయితే సీఎం జగన్ తరచూ దిల్లీ ప్రయాణాలు చేస్తున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఎదురువుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన వెనుక అసలు మర్మమేంటనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన నిధుల గురించి మాట్లాడుకుని వాటిని తెచ్చుకోవడానికి, రాష్ట్రాల సమస్యలు పరిష్కారానికి దేశ రాజధానికి వెళుతుంటారని.. కానీ జగన్ మాత్రం స్వామి కార్యం కన్నా.. స్వకార్యం కోసమే దిల్లీ పర్యటనలు పెట్టుకుంటున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్‌కు ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి అని ఓ ట్యాగ్ లైన్ పెట్టుకుని కేంద్ర పెద్దల ముందు వాలిపోతుంటారని ధ్వజమెత్తుతున్నారు. పేరుకు రాష్ట్ర సమస్యలని.. కానీ లోపల జరిగే మంతనాలు, తతంగం వేరు అనేది ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రజల్లో గట్టిగా వినిపించే మాట. దీంతో ఎప్పటిలాగే జగన్ దిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. అయితే మరి జగన్ దిల్లీ ఎందుకు వెళుతున్నారు అని ప్రజల్లో అనేక సందేహలు తలెత్తుతున్నాయి. కేంద్ర పెద్దలతో వరుస సమావేశాల వెనుక మర్మమేంటి?.. మళ్లీ అప్పుల కోసం అనుమతి కోరనున్నారా?.. లేకపోతే సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడులు నియంత్రించాలని దిల్లీ పెద్దలను వేడుకోనున్నారా?.. అసలు వైఎస్సార్సీపీ, బీజేపీ మధ్య ఏం జరుగుతోంది? అనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.