Andhra Pradesh Assembly Election Notification: రాష్ట్ర ముసాయిదా ఓటరు జాబితాను.. ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లున్నారు. మహిళలు 2 కోట్ల 3 లక్షల 85 వేల851 మంది, పురుషులు కోటి 98 లక్షల 31 వేల 791 మంది, ఇతరులు 3 వేల 808 మంది ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు.
2024 ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 2 లక్షల 36 వేల 586 మంది ఓటర్లు పెరిగారన్న ఆయన.. ప్రతి 1000 మంది పురుషులకు మహిళా ఓటర్లు 1,031 మంది ఉన్నారని చెప్పారు. 2023 ఓటర్ల జాబితా నుంచి 2024 ముసాయిదా జాబితా మధ్య కొత్తగా 15లక్షల 84 వేల789 మంది చేరారన్నారు. ఇందులో వేరే చోటనుంచి తరలివచ్చిన వారు 5లక్షల 47 వేల 19 మంది, ఇతరలు 6లక్షల 54 వేల 73 మంది ఉన్నారని చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19లక్షల 79వేల775 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7లక్షల 40 వేల 857 మంది ఓటర్లు ఉన్నారు.
Mukesh Kumar Meena: 10లక్షల ఓట్లు తొలిగించినా ఒక్క ఫిర్యాదు రాలేదు.. ఎందుకంటే: ముఖేష్ కుమార్ మీనా
మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్: 2023 ఓటర్ల జాబితా 13 లక్షల 48 వేల 203 ఓట్లు తొలగించామన్న మీనా.. ఇందులో మరణించిన వారు 6 లక్షల 88వేల 393 మంది, వేరే చోటకు తరలివెళ్లిన వారు 5లక్షల 78 వేల 625 మంది, రెండు చోట్ల ఓటు ఉండటం వల్ల తొలగించిన వారు 81 వేల 185 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ముసాయిదా అందుబాటులో ఉంచుతామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా.. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. అదే సమయంలో మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.
సమగ్ర పరిశీలన చేశాం: ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సమగ్ర పరిశీలన చేశామన్న మీనా.. మొత్తం 21 లక్షల 18 వేల 940 ఓట్లు తొలగించామన్నారు. అందులో కేవలం 1,533 ఓట్ల తొలగింపు విషయంలోనే లోపాలు చోటు చేసుకున్నట్లుగా జిల్లా పాలనాధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. సున్నా ఇంటి నంబర్లతో 2,51,767 మంది ఓటర్లు ఉండగా ఇంటింటి సర్వే తర్వాత ఆ సంఖ్య 66,740 ఓట్లకు తగ్గిందన్నారు. ఒక్కో ఇంట్లో పది మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు లక్ష 57 వేల 939 ఉన్నాయన్నారు. సర్వే తర్వాత ఆ సంఖ్య 71 వేల 581కు తగ్గిందన్నారు.సుమారు 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలగించామని మీనా తెలిపారు.
ఓటర్ల జాబితాలోని అన్ని తొలగింపులపై పునఃపరిశీలన: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా
ఈవీఎంల తొలిదశ పరిశీలన జరుగుతోంది: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తర్వాత మళ్లీ ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని పార్టీలు తమ దృష్టికి తెచ్చాయన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.. అక్కడి నుంచి ఓటు హక్కు బదిలీ చేసుకుంటే ఇవ్వాల్సిందేనని చెప్పారు. రెండు రాష్ట్రాలో ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఈసీ వద్ద లేదన్న ఆయన.. మన రాష్ట్రంలో ఉన్నవాటిని గుర్తించే సాఫ్ట్‌వేర్ మాత్రమే ఉందని వెల్లడించారు. ఈవీఎంల తొలిదశ పరిశీలన సైతం జరుగుతోందని ముకేష్‌కుమార్ మీనా చెప్పారు.
తప్పుడు అభ్యంతరాలు, తప్పుడు దరఖాస్తులు సమర్పించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్న ఆయన.. మార్గదర్శకాలు పాటించని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల జాబితా తయారీ అంశంలో జోక్యం చేసుకునే పోలీసుల పైనా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సంబంధిత పోలింగ్ కేంద్రం అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్చూరు నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితా తయారీలో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో చర్యలకు ఆదేశించాం.