మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నరసరావుపేట జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది. గుంటూరు రోడ్డులోని తెదేపా కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకూ అన్ని పార్టీల నాయకులు ర్యాలీగా తరలివచ్చారు. 'మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దు' అంటూ నినాదాలు చేశారు. పాలన చేతగాని మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ, కర్నూలు వరద ముంపు గ్రామాలని.. అమరావతిలో ఎన్ని వరదలొచ్చినా ఏ ఒక్క గ్రామం ముంపునకు గురి కాలేదని.. కావాలంటే చరిత్ర చూసుకోవాలని సూచించారు.
ప్రజలే బుద్ధి చెప్తారు...
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అండగా 'మన రాజధాని - మన అమరావతి' అనే నినాదంతో గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి రాజ్యసభ మాజీ సభ్యుడు ఎడ్లపాడు వెంకట్రావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. సీఎం జగన్ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలే వీరికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఉపసంహరించుకోవాలి ..
రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా సీఎం జగన్ మనసు మార్చాలంటూ గుంటూరు జిల్లా పెనుమాక రైతులు, మహిళలు దేవుడిని ప్రార్థించారు. పెనుమాక కూడలిలో ప్రజలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. రాజధాని వికేంద్రీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..