Woman Died in Tiger Attack in Asifabad District : తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పత్తి చేలో కూలి పనికి వెళ్లిన ఓ యువతి (21) పెద్ద పులి దాడికి బలయ్యింది. మెడపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో యువతి మరణించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పులి నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్థులు కాగజ్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు.
అడవిలోకి పారిపోయిన పెద్ద పులి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులులు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో పలు సంఘటనలు చోటు చేసుకోగా తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలం గన్నారం అటవీ ప్రాంతంలో పెద్దపులి ఓ యువతిపై దాడి చేసింది. చేలో పత్తి తీయటానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన మోర్ లక్ష్మి (21)పై పెద్ద పులి మెడపై దాడి చేసి పట్టుకువెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న కూలీలు పెద్దగా కేకలు వేయడంతో వదిలేసి అడవిలోకి పెద్ద పులి పారిపోయింది.
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం - భయాందోళనలో స్థానికులు
రెండు నెలలుగా పులుల సంచారం : తీవ్ర గాయాలైన మోర్లె లక్ష్మిని సహచర కూలీలు, స్థానికులు హుటాహుటీన కాగజ్‌నగర్ తీసుకు వెళ్లి చికిత్స అందించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ యువతి తుదిశ్వాస విడిచింది. లక్ష్మి మృతదేహాన్ని తీసుకుని. గ్రామస్థులు కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు.
రూ.10 లక్షలు పరిహారం: పులి దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు అటవీశాఖ అంగీకారం తెలిపింది. బాధితులతో ఆసిఫాబాద్ డీఎఫ్‌వో శాంతారాం, కాగజ్‌నగర్ ఆర్డీవో లోకేష్ చర్చించారు. అంత్యక్రియలకు తక్షణసాయంగా 20 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మృతురాలి భర్తకు అటవీశాఖలో వాచర్ ఉద్యోగం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 5 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు : నాలుగేళ్ల కిందట దహేగాం మండలంలోని దిగడలో విఘ్నేష్, పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో నిర్మల అనే యువతి పెద్దపులి దాడిలో మృతిచెందటం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇకముందు ఎలాంటి ఘటనలు జరగవని అటవీశాఖ యంత్రాంగం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్ అటవీ ప్రాంతాలనుంచి వస్తున్న పెద్ద పులులకు కనీసం స్థావరాలు ఏర్పాటు చేయాలనేదానిపై కూడా అటవీశాఖ దృష్టి పెట్టటం లేదు. దాంతో అటవీ, మైదాన ప్రాంతాల్లో పులుల సంచారం పెరగటం, ఆవులు, మేకలు, గొర్రెలు, చివరికి మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమవుతోంది.
ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి : ఉమ్మడి ఆదిలావాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఓసీఎఫ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు కలిపి మరో సీఎఫ్, కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేకంగా ఫీల్డ్ డైరెక్టర్ వ్యవస్థ ఉన్నప్పటికీ పులుల సంచారంపై సరైన నిఘా ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తప్పితే పులుల భయం పోయేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం- కంటిమీద కునుకు లేదంటున్న ప్రజలు