ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అవినీతి నిరోధకశాఖ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ మధ్యాహ్నం 2.30 గంటల వరకూ జరిగింది. ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. అనంతరం మళ్లీ 5 గంటలకు రెండో విడత విచారణ ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు ముగించారు. మొత్తం దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. మొదటి రోజున విచారణ రాత్రి 8.30 గంటల వరకూ కొనసాగించటంపై న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం విచారణ త్వరగా ముగించారు.
అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలపైనే శుక్రవారం విచారణ జరిగినట్లు సమాచారం. 'మొత్తం 3 లేఖలు మీ నుంచి ఈఎస్ఐ అధికారులకు వచ్చాయి. అలా ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చింది? తద్వారా మీకు ఎలాంటి లాభం వచ్చింది? అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు?' వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
లేఖల ఆధారంగా అచ్చెన్నాయుడుని ఈ కేసులో దోషిగా నిరూపించేందుకు అనిశా అధికారులు యత్నించారని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు అన్నారు. అయితే ఔషధాల కొనుగోలు వ్యవహారం అంతా ఈఎస్ఐ డైరక్టర్ల చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు. లేఖ అనేది కేవలం సలహా మాత్రమేనని... నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులేనని ఆయన అన్నారు.
మరోవైపు అచ్చెన్నాయుడుకి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ శనివారంతో ముగియనుంది. దీనివల్ల అచ్చెన్నాయుడిని మరోసారి అనిశా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి కూడా ఇంకా మెరుగుపడలేదని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఎండోస్కోపి నిర్వహించారు. రక్తపు విరేచనాలు అవుతున్నట్లు ఆయన వైద్యులకు తెలపటంతో.. సంబంధిత పరీక్షలు కూడా చేశారు. వాటికి సంబంధించిన నివేదికల ఆధారంగా చికిత్స అందించనున్నారు.
ఇదీ చదవండి