Snake Bit the Constable: రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల లే ఔట్ అభివృద్ధి పనులు బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్‌ను పాము కరిచింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో కానిస్టేబుల్ ని పాముకరిచింది. వెంటనే ఆ పామును తోటి కానిస్టేబుళ్లు చంపివేశారు. పవన్ కుమార్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ ఆసుపత్రికి వచ్చారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పవన్ కుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ పవన్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పవన్ కుమార్ ది ప్రకాశం జిల్లా దర్శి. రాజధాని ప్రాంతంలో బందోబస్తు కోసం వచ్చి పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పవన్ కుటుంబ సభ్యులు దర్శి నుంచి గుంటూరు వచ్చారు. పవన్ కుమార్‌కు మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్ నుంచి రమేష్ ఆసుపత్రికి తరలించారు.
పరీక్ష రాసి వస్తున్న సమయంలో.. తండ్రి కళ్లెదుటే కుమార్తె మృతి: ఎన్టీఆర్ జిల్లా గన్నవరం విజయవాడ రూరల్ మండలం రామవరపాడు రింగ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జి కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన బొర్రా సత్యనారాయణ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆయనకు ఇద్దరు కుమారైలు.. పెద్ద కుమార్తె జాహ్నవి(20) ఏపీ ఈఏపీ సెట్ రాసేందుకు తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై ఎనికేపాడులోని ఎస్ఆర్కేఆర్ కాలేజ్‌కు వెళ్లింది.
పరీక్ష రాసి రామవరప్పాడులోని ఆంజనేయస్వామి ఆలయం వరకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న అయిల్ ట్యాంకర్ అత్యంత వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పడంతో.. తండ్రి ఎడమ సీటు పక్కకు పడ్డారు. జాహ్నవి లారీ వైపు పడగా చక్రాలు ఆమె మీద నుంచి వెళ్లడంతో.. జాహ్నవి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు.
విమానంలో గుండెపోటు.. ప్రయాణికుడు మృతి: విమాన ప్రయాణంలో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాడు. మరికొద్ది సేపట్లో విమానాశ్రయానికి చేరుకుంటుందన్న సమయంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో సదరు ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజుగా గుర్తించారు. మృతుడ్ని విజయవాడ జీజీహెచ్‌కి తరలించిన విమానాశ్రయ అధికారులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇవీ చదవండి: