శాసనసభ బడ్జెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నదాతకు అండగా ఉంటామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం-అనుబంధ రంగాలపై జరిగిన చర్చలో సీఎం కీలక ప్రసంగం చేశారు. నాలుగేళ్లలో రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగామన్న చంద్రబాబు రాష్ట్ర రైతాంగాన్ని ప్రపంచస్థాయి ఎగుమతులు చేసేలా మారుస్తామని అన్నారు. 2004-2014 మధ్య రైతులు పడిన ఇబ్బందులను గణనీయంగా తగ్గించామని శాసనసభలో వెల్లడించారు. వ్యవసాయ రంగ వృద్ధిలో దేశం 2.4 శాతం వృద్ధి నమోదు చేస్తే, ఏపీ 11 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కర్షకుల అభ్యున్నతికి
అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువస్తామని ప్రకటించారు.
భాజపాపై గరం
అమిత్ షా అబద్ధాలు చెప్పడానికే రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు. అమిత్ షా తన తనయుడి కోసమే పనిచేస్తున్నారన్నారు. భార్యను చూసుకోలేని వారు దేశానికి ఏం చేయగలరన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టాలని చూస్తే భంగపాటు తప్పదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ తెదేపా పోరాటం ఆగదని తెలిపారు.