New Guidelines In AP Building Constructions: భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులొచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన పత్రాలు లేవంటూ కొర్రీలు వేయకుండా 15 మీటర్ల ఎత్తు వరకు స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోయేలా నిబంధనలను సడలిస్తోంది. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్‌మెంట్లలో ఇకపై సెల్లార్‌కు అనుమతి ఇవ్వనుంది. భవన నిర్మాణంలో సడలించిన నిబంధనలపై కొత్త సంవత్సరంలో ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసిన వెంటనే అనుమతి: భవన నిర్మాణమంతా ఒకెత్తు అయితే అనుమతులు పొందడం మరో ఎత్తు. అవసరమైన పత్రాలు జత చేయలేదంటూ తరుచూ కొర్రీలు, వీటికి తోడు వివిధ దశల్లో అక్రమ వసూళ్ల ఫలితంగా భవన నిర్మాణాలకు అనుమతులంటే ప్రజలు హడలిపోతున్నారు. దీనికి చెక్ పెట్టేలా భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తుదారుల స్వీయ ధ్రువీకరణపై 15 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు అనుమతులివ్వనున్నారు. అందుకుగాను 500 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్‌మెంట్లలో సెల్లార్‌కు అనుమతివ్వాలని నిర్ణయించింది.
బహుళ అంతస్థుల భవన నిర్మాణ అనుమతులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో తీసుకొస్తున్నారు. దీనికి డీపీఎమ్ఎస్ పోర్టల్‌కే ఇతర ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తున్నారు. వాటి ద్వారా చకచకా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 120 మీటర్ల కంటే ఎత్తయిన భవనాల్లో సెట్ బ్యాక్ 20 మీటర్లకు కుదిస్తున్నారు. సవరించిన భవన నిర్మాణ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి జనవరి మొదటి వారంలో జీవో జారీ చేయనుంది.
గుంటూరులో గ్రీన్‌గ్రేస్ నిర్మాణాలపై విజి'లెన్స్' - రైల్వేశాఖ లేఖను దాచిందెవరో?
కొత్త నిబంధనలతో అక్రమ లే అవుట్లకు చెక్: ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా వేస్తున్న లే అవుట్ల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిలో అంతర్గత రహదారులు 40 అడుగుల్లో ఉండాలన్న నిబంధనను 30 అడుగుల వెడల్పులో వేస్తే సరిపోయేలా నిబంధనలు నడలిస్తోంది. రోడ్లకే ఎక్కువ విస్తీర్ణం పోతుందన్న ఉద్దేశంతో చాలామంది అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న ప్రజలు వాటిలో నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నారు. కొత్త నిబంధనలతో వీరందరికీ ఊరట దక్కనుంది.
ఆన్‌లైన్‌లోనే అనుమతులు: బహుళ అంతస్థుల నిర్మాణాల విషయంలో ఇప్పటివరకు అగ్నిమాపక, ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి మొదట ఎన్ఓసీ తీసుకున్నాకే డీపీఎమ్ఎస్ పోర్టల్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. ఆ రెండు శాఖల నుంచి ఎన్ఓసీలు అప్‌లోడ్ చేశాకే పోర్టల్ అనుమతిస్తోంది. కొత్తగా సింగిల్ విండో విధానంలో అనుమతులకు దరఖాస్తు అప్‌లోడ్ చేసి ఫీజులు చెల్లిస్తే చాలు. భవన నిర్మాణానికి అప్‌లోడ్ చేసిన దరఖాస్తులు ఇతర ప్రభుత్వ శాఖలకు వెళతాయి. సంబంధిత అధికారులు పరిశీలించి ఎన్ఓసీలను జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖలు కూడా ఆన్‌లైన్‌లోనే అనుమతులివ్వనున్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు: భవన నిర్మాణ అనుమతులను ప్రభుత్వం ఎంతో సులభతరం చేసింది. ఇకపై ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరించనుంది. ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాక వాటిపై పునఃపరిశీలన ఉంటుంది. ఫిర్యాదులపైనా విచారణ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ పర్సన్లపై పోలీసు కేసు నమోదు చేసి వారి లైసెన్స్ రద్దు చేయనున్నారు. అంతేగాక భవన నిర్మాణ అనుమతులు వెనక్కి తీసుకుంటారు. ప్రభుత్వ స్థలంలో తప్పుడు దస్తావేజులు సృష్టించి వేరొకరి స్థలంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
Rushikonda constructions కొనసాగుతున్న విధ్వంసం.. రుషికొండపై యథేచ్ఛగా నిర్మాణాలు