VIRRD Hospital : సువిశాల ప్రాంగణం, అధునాతన వైద్య పరికరాలు, మోడరన్ ఆపరేషన్ థియేటర్లు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, కార్పొరేట్ దవాఖానాకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ద్వారకా తిరుమలలోని విర్డ్ ఆసుపత్రి. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహేబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్ పేరుతో 2008లో ప్రారంభమైంది. ద్వారకాతిరుమల ఒక మారుమూల ప్రాంతం. సాధారణ వైద్య సేవలే అంతంతమాత్రం.
ఇక రోడ్డు ప్రమాదాల్లో రక్తమోడినా, కాళ్లు కీళ్లు విరిగినా ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఆ పరిస్థితిని మార్చేందుకు సంకల్పించిందే విర్డ్ ఆసుపత్రి. వేగేశ్న ఆనందరాజు, అనంత కోటిరాజు దాతృత్వంతో ఈ వైద్యాలయం పురుడుపోసుకుంది. వాళ్ల సేవా సంకల్పానికి పలు సంస్థలు, దాతలు చేయూతనిచ్చారు.
ద్వారకా తిరుమల దేవస్థానం తరపున ఐదెకరాల భూమి, 5కోట్ల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థానం 10 కోట్లు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులు 80 లక్షలు, ఇలా ఎంతో మంది విరాళంగా అందించారు. మడుపల్లి మోహన్ గుప్తా అనే దాత.. అరెకరం భూమిలో 20 గదులు నిర్మించి ఆసుపత్రి అవసరాల కోసం అందించారు. అలాంటి ఎందరో మానవతామూర్తుల చేయూతతో నిలబడిన భవనాలే ఇక్కడ ప్రస్తుతం వైద్యానికి ఉపయోగపడుతున్నాయి.
దివ్యాంగుల జీవితాల్ని నిలబెట్టడం విర్డ్ ఆసుపత్రి ప్రత్యేకత. పోలియో బాధితులకు, పుట్టుకతోనే అవయవలోపంతో బాధపడేవారికి, ప్రమాదాల్లో కాళ్లు చేతులు పోగొట్టుకున్నవారిని వారికాళ్లపై వాళ్లు నిలబడేందుకు శక్తినంతా ధారపోస్తారు ఇక్కడి వైద్యులు. కాలు, చెయ్యి కోల్పోయినవారికి కృత్రిమ అవయవాలు అందిస్తారు. ఇందుకోసం ఇక్కడే అన్ని వసతులతో కూడిన తయారీ కేంద్రం ఉంది. కరోనా ముందు వరకూ కేవలం ఆర్థోపెడిక్ సంబంధి వైద్య సేవలు అందించిన విర్డ్ ఆసుపత్రి.. ఇటీవలి కాలంలో సాధారణ వైద్య చికిత్సలూ అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన సమయాల్లో ఇతర ప్రాంతాల నుంచీ వైద్యు నిపుణుల్ని తీసుకొచ్చి.. రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తారు
" విర్డ్ సంస్థ 2008 సంవత్సరం నుంచి సేవలనందిస్తోంది. గ్రామీణ ప్రజలకు ఎముకల విభాగంలో సైతం సేవలనందిస్తోంది. ఎమర్జేన్సి, ట్రామా కేసులు, సెర్బల్ పాలసీ కేసులు, పోలీయోకు చికిత్స అందిస్తున్నాము. మోకీలు, తుంటి, భుజం వంటి భాగాలకు కీ హోల్ సర్జరీ చేస్తున్నాము. అత్యధునిక సాంకేతికతో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. హస్పిటల్లో ఉన్నంత కాలం భోజనం, వైద్యం, మందులు అన్ని ఉచితంగా అందిస్తున్నాము. ఆరోగ్య శ్రీ లేని వారిక నామ మాత్రంగా నగదు తీసుకుని సేవాలందిస్తున్నాము."-భవ్యచంద్, కీళ్లు, ఎముకల వైద్య నిపుణులు
దివ్యాంగులకు ఆరోగ్యశ్రీ ఉంటే చాలు శస్త్రచికిత్సతోపాటు.. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తోంది విర్డ్ హాస్పిటల్. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపైనా వైద్యం అందిస్తోంది. మిగతా రోగులకు నామమాత్రపు రుసుముతో సేవలు అందిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచీ శస్త్ర చికిత్సల కోసం రోగులు వస్తున్నారు. నామమాత్రపు ఛార్జీలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
" నేను ఎనిమిది సంవత్సరాలుగా మోకీలు నొప్పులతో బాధపడుతున్నాను. కిందటి సంవత్సరం నుంచి బాగా ఇబ్బంది మొదలయ్యింది. ఇక్కడికి వచ్చి చూపిస్తే వైద్యులు సమస్య చేయి దాటిపోయిందన్నారు. అయినా సరే వైద్యుల శ్రద్ధ తీసుకుని చికిత్స అందించారు. ఇంతకముందు ఉన్నట్లుగా నాకు ఇప్పుడు సమస్య లేదు. ఇక్కడ నాకు వైద్యం ఉచితంగా అందించారు. హస్పిటల్లో వాతావరణం చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంది. "-వెంకట్రావు, భీమడోలు
ప్రస్తుతం దాతల డిపాజిట్లపై ఏటా వస్తున్న వడ్డీతోనే విర్డ్ ఆసుపత్రి చక్కటి వైద్య సేవలు అందిస్తోంది. ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం కూడా సేవల విస్తృతికి తనవంతు సహకారం అందిస్తోంది. ఏదో ఆసుపత్రి లా కాకుండా బాధ్యతగా నిర్వర్తించడం వల్లే విర్డ్ ఆసుపత్రి రోగుల ప్రశంసలు అందుకుంటోందని.. ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తన్నారు.
" గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయలు అందుబాటులో లేక ప్రజలు శ్రమ, ధనం ఖర్చు చేసి ఏలూరు, తాడేపల్లి గూడెం వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల అందరికి అందుబాటులో ఉండాలని ఈ హస్పిటల్ను ఏర్పాటు చేశాము. గ్రామీణ ప్రాంతంలో పనిచేసినట్లు వైద్యులు గ్రామీణ ప్రాంతంలో పనిచేయాలంటే వైద్యులకు సేవాభావం ఉండాలి. అలా ఉన్న వైద్యులే ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. "-నారాయణ మూర్తి, విర్డ్ ఆసుపత్రి ట్రస్టీ
ఇవీ చదవండి :