Quality Check in Polavaram Project Works: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గైడ్‌బండ్ నిర్మాణంలో తలెత్తిన నాణ్యత లోపాలే గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనుల్లోనూ తలెత్తవచ్చని కేంద్రం నియమించిన నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. పోలవరం ప్రధాన రాతి, మట్టికట్ట గ్యాప్ 1లో ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులు చేపట్టారు. గైడ్‌బండ్‌లో అక్కడి నేలను అభివృద్ధి చేసేందుకు వైబ్రోస్టోన్ కాలమ్స్ తరహాలో నేలను అభివృద్ధి చేశారు. గ్యాప్ 1 ప్రధాన డ్యాం ప్రాంతంలోనూ అలాగే వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మించారు.
Polavaram Guide Bund Collapse Reason: ఒకే సీజన్‌లో పూర్తికావాల్సిన గైడ్‌బండ్ నిర్మాణం ఆలస్యమై, ఆ సమయంలో వచ్చిన వరదల వల్ల వైబ్రోస్టోన్ కాలమ్స్ నాణ్యత దెబ్బతిని గైడ్‌బండ్ కుంగిపోయిందని కేంద్రం నియమించిన నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. గ్యాప్ 1 ప్రధాన డ్యాం ప్రాంతంలో నిర్మించిన వైబోస్టోన్ కాలమ్స్ నిర్మాణం విషయంలోనూ ఇదే సవాలు ఎదురుకావచ్చని ఊహిస్తున్నట్లు పాండ్యా ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. వైసీపీ ప్రభుత్వంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలోనే ఆ నిర్మాణ పనులూ చేపట్టారు.
Sridhar Over Polavaram Works: పోలవరంలో గైడ్‌బండ్ కుంగిపోవడానికి గల కారణాలు తేల్చాలని పాండ్యా ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని కేంద్రం నియమించింది. జూన్‌లో వారు ప్రాజెక్టును సందర్శించి గైడ్‌బండ్, ఇతర పనులు పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఆ ముసాయిదా నివేదికలోని అంశాలపై కేంద్ర జల్‌శక్తి సలహాదారు వెదిరె శ్రీరాం కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. "గైడ్‌బండ్ రెండు మూడు సీజన్లలో నిర్మించడం వల్లే సమస్య వచ్చిందని మీరు తేల్చారు. వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మించేటప్పుడు రెండుసార్లు వరదలు వచ్చి, బంకమట్టి రేణువులు వాటిమధ్య చేరిపోయాయని, ఆ కారణంతో వైబ్రోస్టోన్ కాలమ్స్ డ్రైనేజి సామర్థ్యాన్ని కోల్పోయి తమ సామర్థ్యం మేరకు పని చేయకపోవడం వల్లే గైడ్‌బండ్ కుంగిందని నివేదించారు. ఇదే కారణమైతే.. పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్ 1 ప్రాంతంలోనూ వైబ్రోస్టోన్ కాలమ్ నిర్మించారు. అవి నిర్మించేటప్పుడు మూడుసార్లు వరద వచ్చింది. ఇక్కడి తరహాలోనే ఆ నిర్మాణాలకూ సమస్య తలెత్తుతుంది కదా" అని కమిటీని శ్రీరామ్ ప్రశ్నించారు.
Polavaram Project Works: "గ్యాప్ 1 రాతి, మట్టి డ్యాం ప్రాంతంలో నిర్మించిన స్టోన్ కాలమ్స్‌కూ ఇదే సమస్య ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నాం" అని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే నిర్మాణంతో పాటు దాన్ని ఆనుకుని ప్రధాన రాతి, మట్టికట్ట డ్యాం నిర్మాణం చేపట్టాలి. ఈ ప్రధాన డ్యాం మూడు భాగాలుగా ఉంటుంది. గ్యాప్ 1లో 565 మీటర్ల మేర రాతి, మట్టికట్ట నిర్మించాలి. గ్యాప్ 2లో దాదాపు 1,960 మీటర్ల మేర ప్రధాన డ్యాం నిర్మించాలి.
Quality in Polavaram Project Works: గ్యాప్ 3లో 162 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తులో కాంక్రీటు డ్యాం నిర్మాణం పూర్తయింది. తొలుత ఇది కూడా రాతి, మట్టికట్టగా నిర్మించాలనుకున్నా, కమిటీల నిర్ణయం మేరకు కాంక్రీటు డ్యాంగా మార్చారు. ప్రస్తుతం నిజనిర్ధారణ కమిటీ అనుమానిస్తున్నది గ్యాప్ 1లో చేపట్టిన వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణ పనులనే. ఆ పనులు మూడు సీజన్లలో జరిగాయి. ఈ సమయంలో 2020, 2021, 2022 సంవత్సరాల్లో వరదలు వచ్చాయి. ఆ సమయంలోనూ బంకమట్టి రేణువులు స్టోన్‌కాలమ్స్ మధ్య చేరితే వాటి నిర్మాణ సామర్థ్యం దెబ్బతింటుందని ఇప్పుడు అనుమానిస్తున్నారు.
Polavaram Works: 2023 జూన్ నాటికే వైబ్రోస్టోన్ కాలమ్‌ల నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 1 ప్రధాన డ్యాం ప్రాంతంలో ఎగువన 350 మీటర్ల మేర, దిగువన 400 మీటర్ల మేర వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణం చేపట్టారు. 2021 డిసెంబరులోనే డ్యాం డిజైన్ రివ్యూ కమిటీకి అందించిన వివరాల ప్రకారం ఇక్కడ వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణం.. 85 వేల మీటర్ల పొడవునా మట్టి, సిమెంటు మిశ్రమంతో భూసామర్థ్యం పెంచే పనులకు 91 కోట్ల 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేసి, పనులు పూర్తయ్యాయని నివేదించారు. దీంతోపాటు మరో 38కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చయినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అంటే ఈ పనులకే 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లయింది. ఇప్పుడు పనుల నాణ్యత తేలిస్తే తప్ప ముందడుగు వేసే పరిస్థితి లేదు.