Polavaram Upper Coffer Dam: పోలవరం ప్రాజెక్టు వద్ద మరో పెనుసవాలు ఎదురయింది. గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే వైపు మళ్లించి ప్రధాన డ్యాం నిర్మించుకునే ప్రాంతంలో పెద్దగా ఎలాంటి వరద, నీటి తాకిడి లేకుండా ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలను నిర్మించారు. వరద కాలంలో ఇబ్బంది లేకుండా ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకునేందుకు ఇవి సహకరిస్తాయి. కాఫర్ డ్యాంలను నిర్మించాక తొలిసారి ఇప్పుడు గోదావరికి వరద వచ్చింది. ఈ డ్యాంల మధ్య ప్రాంతంలో కొంత సీపేజీ మినహా పెద్దగా ఎలాంటి సమస్య ఉండకూడదు. అలాంటిది ఎగువ కాఫర్‌డ్యాం సీపేజీ, లీకేజీ అంచనాలకు మించి ఉంది. ఫలితంగా నిర్మాణ ప్రాంతం గోదావరిని తలపిస్తోంది.
కాఫర్‌డ్యాంల మధ్య సులువుగా పనులు చేసుకోవాల్సిన ప్రాంతంలో ప్రస్తుతం 19.72 మీటర్ల మేర నీరు నిలిచింది. ఇక్కడ 14 మీటర్ల నీరు ఉన్నప్పటికీ అంతగా ఇబ్బంది ఉండదు. ప్రస్తుతమున్నది దీనికి 5 మీటర్లు ఎక్కువ. ఇది ఒక్క ఎగువ కాఫర్‌డ్యాం లీకేజీ నీరేనా? లేదా దిగువ కాఫర్‌డ్యాం నుంచీ వెనక్కు లీకవుతోందా? అన్నది అర్థం కాని పరిస్థితులున్నాయి. దీనిపై అధికారులు మేథోమథనం చేస్తున్నారు. సాధారణంగా ఎగువ కాఫర్‌డ్యాం నుంచి కొంత సీపేజీ సహజమే. అది డ్యాం భద్రతకు మంచిదే. కానీ ఈ స్థాయిలో నీరు లీకేజీ ఉండకూడదు. ఇది అనూహ్యం. ఏం చేయాలని పాలుపోని పరిస్థితులున్నాయి. పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం అధికారులు దీనిపై దృష్టి సారిస్తున్నారు అని ఒక ఇంజినీరింగ్ నిపుణుడు పేర్కొన్నారు. గంటగంటకు ఒక సెంటీమీటరు చొప్పున ఆ మధ్య ప్రాంతంలో నీటిమట్టం పెరుగుతోందని లెక్కించారు. అంటే 4 రోజులకు ఒక మీటరు నీటిమట్టం పెరుగుతున్నట్లే.
ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో అంటే ఎగువ, దిగువ డ్యాంల మధ్య ప్రాంతంలో పని చేసుకోవాలంటే నీటిమట్టం 14 మీటర్లకన్నా దిగువే ఉండాలి. అలా ఉంటే కొంత మేర నీటిని ఎత్తిపోసుకునే అవకాశముంటుంది. ప్రస్తుతం వరదలా నీరు డ్యాంల మధ్య ప్రాంతాన్ని ముంచెత్తడంతో వైబ్రో కాంపాక్షన్ పనులనూ నిలిపేశారు. గోదావరి వరద కాలమంతా ఇలాగే ఉంటుందని అంచనా. ప్రస్తుత సీజన్‌లో ప్రధాన డ్యాం లేదా, డయాఫ్రంవాల్ పనులు చేసుకునేలా పరిస్థితులు లేవు. కిందటి వరద కాలంనాటికి దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తి కాలేదు. దిగువ కాఫర్‌డ్యాంను 30.5 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి వచ్చింది. ఆ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల వరద ఎగదన్నింది. పనులు చేసుకోలేకపోయారు. ప్రాజెక్టు అథారిటీ సైతం దీనిపై నాడు మండిపడింది.
ఈ వరద కాలం నాటికి రెండు కాఫర్‌డ్యాంల నిర్మాణమూ పూర్తయినందున హాయిగా పనులు చేసుకునే వెసులుబాటు కలగాలి. అలాంటిది దాదాపు గోదావరిని తలపించేలా పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయంటే పరిస్థితిని ఊహించవచ్చు. వరద కాలం అయిపోయాకా ఈ నీటిమట్టాలు ఎంత మేర తగ్గుతాయనేది ప్రశ్నార్థకమే. నీరు ఎటూ వెళ్లే మార్గం లేదు. ఆవిరి రూపంలో పోయేది అంతంతే. ఇంత నీరు ఎత్తిపోయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాలి. పైగా ఆ నీరు అంతా ఎత్తిపోయడానికి పట్టే కాలం ఎంతో ఎక్కువ. అది ఎంతవరకు సాధ్యమన్నదీ ప్రశ్నార్థకమే. పరిస్థితి ఇలా ఉంటే ఇక పనులు చేసుకునేది ఎలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొంత అధ్యయనం తర్వాత ఈ అంశంపై చర్చించడానికి పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం సమావేశమవడానికి సిద్ధమవుతున్నాయి.